బాబు పాత్రలో పవన్… ఎన్టీఆర్ ప్లేస్ లో బాబు!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో దీంతోపాటు ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లతో కలిపి మొత్తం పది పిటిషన్లు పెండింగులో ఉన్నాయని అంటున్నారు. దీంతో… జగన్ పక్కా ఫీల్డింగ్ సెట్ చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఏమిటనేది ఆసక్తిగా మారింది.

చంద్రబాబు జైల్లో ఉన్నారు. ఈ సమయంలో బాబు ప్లేస్ లో బాలకృష్ణ కూర్చుంటే అది నారా వారి ఫ్యామిలీకి ఏమాత్రం కంఫర్ట్ గా అనిపించడం లేదు. అది ఎల్లో మీడియాకు సైతం నచ్చనట్టే కనిపిస్తుంది. మరోపక్క చినబాబును ఇన్నర్ రింగ్ రోండ్ స్కాం కేసులో ఏ14గా చేర్చుతూ సీఐడీ మెమో దాఖలు చేసింది. ఇవాళో, రేపో తీసుకెళ్తారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

ఈ సమయంలో పార్టీకి హోప్ లేదని అంటున్నారు. బ్రాహ్మణి, భువనేశ్వరిల వల్ల కాదని చెబుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో పార్టీకి కాపాడేవారు ఎవరూ లేరా అని చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో… తిరుపతి పర్యటన సందర్భంగా జనసేన నేత కొణిదెల నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రకరకాల ఊహాగాణాలు తెరపైకి వస్తున్నాయి.

ఇందులో భాగంగా… టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ ముందుగానే ప్రకటించడం వెనుక కుట్రలు ఏమైనా ఉన్నాయా అంటే… అవుననే సమాధానం వచ్చినట్లు తెలుస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బాబును ములాకత్ లో కలిసిన అనంతరం పవన్ కల్యాణ్… రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని ప్రకటించారు.

ఇదే సమయంలో ఉమ్మడి కార్యచరణ చేస్తాం అని తెలిపారు. దీంతో స్థబ్ధగా ఉన్న టీడీపీ కేడర్ లో కాస్త ఉత్సాహం వచ్చి ఉంటుందని చెబుతున్నారు. త్వరలో టీడీపీ – జనసేన ఉమ్మడి సభలు ఉంటాయని… ప్రస్తుతానికి పవన్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నడుచుకోవాల్సి రావొచ్చని అంటున్నారు. అయితే దీనివెనుక భారీ స్కెచ్ ఉందని అంటున్నారు పరిశీలకులు.

టీడీపీలోని నాయకత్వ సమస్యలను సాకుగా చూపి టీడీపీని కైవసం చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన వ్యూహాత్మక ఎత్తుగడ అని కొందరు సూచిస్తున్నారు. ఈ భయం ముందే ఉండటం వల్లే ఈ పొత్తు విషయాలు లోకేష్ కు అంతగా ఇష్టం లేదని చెబుతున్నారు. అయితే చంద్రబాబుకు మాత్రం పవన్ పై నమ్మకం ఉందని అంటున్నారు. మరికొంతమంది మాత్రం నాటి పరిస్థితి రిపీట్ అయ్యే అవకాశం లేకుండా పోలేదని చెబుతున్నారు.

దీంతో… నాడు నందమూరి తారక రామారావుకు చంద్రబాబు వల్ల ఏమి జరిగిందో.. కాస్త అటు ఇటుగా చంద్రబాబుకు పవన్ కల్యాణ్ వల్ల అలాంటిదే జరిగే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు పరిశీలకులు.