స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించినప్పటినుంచీ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… చంద్రబాబు అరెస్ట్ తర్వాత అధికర వైసీపీ పై పురందేశ్వరి విమర్శలు, కేంద్రంవద్ద ఫిర్యాదుల జోరు పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఆమె విమర్శలను ఏపీలో జనం, కేంద్రంలో పెద్దలు ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటున్నారనేది తెలిసిన విషయమే. ఇదే సమయంలో పవన్ కూడా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాకత్ అయిన అనంతరం తాను ఆ నిర్ణయం అప్పుడే తీసుకున్నట్లు చెబుతూ… ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ – జనసేన కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయని ప్రకటించారు. ఆ తర్వాత పలువురు కీలక నేతలు, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా రంగంలోకి దిగిన సీనియర్లు పార్టీని వీడి వెళ్లిపోయారు. అనంతరం పవన్ పైనా, నాదెండ్ల మనోహర్ పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆ సంగతి అలా ఉంటే… గతం మరిచిపోయారో ఏమో కానీ పురందేశ్వరి.. చంద్రబాబు కోసం ఈ స్థాయిలో పోరాడటం అనేది రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయాలపై విజయసాయిరెడ్డి లాంటి నేతలు నేరుగా పురందేశ్వరిపై ఫైరవుతూనే ఉన్నారు. ఆమె చేస్తున్న ప్రతీ విమర్శకూ, తీసుకుంటున్న ప్రతీ నిర్ణయానికి స్పాట్ లో కౌంటర్లు వేసేస్తున్నారు. అయితే చంద్రబాబుకు ఆమె పలుకుతున్న మద్దతువెనుక అసలు కారణం మరొకటి ఉందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
అదేమిటంటే… వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేయాలనేది పురంధేశ్వరి ఆలోచన! అలా అని ఒంటరిగా బీజేపీ నుంచి బరిలో దిగితే ఆమె గెలవడం దాదాపు అసాధ్యం! అలా అని టీడీపీ – జనసేన తో కలిసి ముందుకెళ్దామంటే అది పార్టీ అధిష్టాణం హస్తినలో తీసుకోవాల్సిన నిర్ణయం. దీంతో టీడీపీ, జనసేనతో పొత్తులో ఉన్నా టికెట్ ఖరారు చేయాల్సింది చంద్రబాబే కాబట్టి… లోపాయకారీగా ముందుకు వెళ్తే ప్రయోజనం ఉంటుందని ఆమె భావిస్తున్నారని అంటున్నారు.
అంటే… ఒకవేళ టీడీపీ – జనసేన పొత్తులో లేకపోయినా బీజేపీ నుంచి పురంధేశ్వరి పోటీ చేసే చోట బలహీన అభ్యర్థిని బరిలో దింపడం అనేది ఆమె చంద్రబాబు నుంచి ఆశిస్తున్న ప్రతిసాయంగా అభివర్ణిస్తున్నారు. అలాకానిపక్షంలో ఆమె కొత్తపార్లమెంట్ గేటు తాకలేరనేది వారి అభిప్రాయంగా ఉంది. ఆ కారణంతోనే ఆమె ఈ స్థాయిలో బాబుకోసం ఫైట్ చేస్తున్నారని చెబుతున్నారు. సరిగ్గా పవన్ కూడా ఇదే ఆలోచనతోనే పొత్తు ప్రకటన చేశారని చెబుతున్నారు విశ్లేషకులు.
గత ఎన్నికల్లో పార్టీ సంగతి పక్కనపెడితే స్వయంగా అధినేతగా పవన్ కల్యాణ్ స్వయంగా రెండు చోట్ల పోటీచేశారు. రెండు చోట్లా ఓడిపోయారు. దీంతో రాజకీయాల్లో పవన్ పేపర్ పులి, మీడియా టైగర్, సోషల్ మీడియా చిరుత తప్ప మరొకటి కాదనే కామెంట్లు వినిపించాయి. దీంతో… ఆయనకు కూడా ఎమ్మెల్యేగా అసెంబ్లీ గేటు తాకాలని కోరిక ఉందని… అది ఒంటరిగా పోటీచేస్తే జగన్ – చంద్రబాబుల మధ్య నలిగిపోవడం మినహా ప్రయోజనం ఉండదని ఒక నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు.
ఈ సమయంలో చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ బేషరతుగా లొంగిపోవాల్సి వచ్చిందని… ఫలితంగా పవన్ ను ఒకసారైనా అసెంబ్లీకి పంపే బాధ్యత చంద్రబాబు తీసుకున్నారని చెబుతున్నారు. ఇలా పార్లమెంటుకు వెళ్లాలని పురందేశ్వరి.. అసెంబ్లీకి వెళ్లాలని పవన్ లు పూర్తిగా చంద్రబాబుపైనే ఆధారపడిపోయారని… ఇది అవసరార్ధ ప్రేమే తప్ప… చంద్రబాబు జైల్లో ఉంటే చలించిపోయిన సందర్భం కాదని మరికొంతమంది విమర్శిస్తున్నారు. చంద్రబాబుకున్న రాజకీయ బలం వీరికి అవసరం అనేది ఫైనల్ కన్ క్లూజన్ అన్నమాట!