పవన్ కు చిరంజీవి పోస్టు… బీజేపీ కీలక నిర్ణయం?

పవన్ తన గురించి తాను ఏమి ఊహించుకుంటారో తెలియదు కానీ… జనసేన కార్యకర్తలు మాత్రం చాలా ఎక్కువగానే ఊహించుకుంటారని అంటుంటారు. ఇందులో భాగంగా… పవన్ కల్యాణ్ ఎక్కడ కనిపించినా సీఎం సీఎం అని నినాదాలు చేస్తుంటారు. అందుకు తాను అర్హుడిని కాదు, తనకు అంత లేదు అని చెప్పుకుని నెత్తీ నోరు కుట్టుకున్నా వినిపించుకోరు!

ఆ సంగతి అలా ఉంటే… తాను రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలిపించలేదనే అక్కసు అయితే పవన్ అప్పుడప్పుడూ బయటపెడుతుంటారు. ఇందులో భాగంగా… ఈసారి తాను అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా తనను ఎవరు ఆపుతారో చూస్తానంటూ కాస్త గట్టిగానే చెప్పారు. అయితే అసెంబ్లీలో అడుగుపెట్టడం కోసం ఇంత హంగామా అవసరమా అని వైసీపీ నేతలు కౌంటర్లు వేశారు.

ఆ సంగతి అలా ఉంటే నిజంగానే పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈసారి పవన్ ను అసెంబ్లీ నుంచి కాకుండా పార్లమెంట్ కు పోటీచేయించి… కేంద్ర కేబినెట్ లో ఆయనకు సముచిత స్థానం ఇవ్వాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. అలా అని జనసేనను బీజేపీలో విలీనం చేయరు కానీ… పూర్తిస్థాయి పొత్తులో పవన్ కు ఈ రిటన్ గిఫ్ట్ ఇవ్వనున్నారని అంటున్నారు.

అవును… పవన్ కు కేంద్ర కేబినెట్ మంత్రి ప్రతిపాదనను బీజేపీ పెద్దలు ముందుంచనున్నారని అంటున్నారు. ఈ ప్రతిపాదనను పవన్ కళ్యాణ్, జనసేన శ్రేణులు అంగీకరిస్తాయా లేదా అనే సంగతి కాసేపు పక్కనపెడితే… మోడీ – అమిత్ షా అనుకుంటే పవన్ ని ఒప్పించడం అరనిమిషం పని అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారని అంటున్నారు.

ఇదే సమయంలో… పవన్ కళ్యాణ్ కి గతంలో చట్టసభల్లో పనిచేసిన అనుభవం లేకపోవడం.. జనసేన సంస్థాగతంగా పూర్తిగా పట్టు సాధించకపోవడం.. రాష్ట్రంలో మెజార్టీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా లేకపోవడం.. పైగా పవన్ కు జనాలను ఓటర్లుగా మార్చే పరిపక్వత లేకపోవడం లాంటి అనేక కారణాలవల్ల పవన్ కళ్యాణ్ 2024 కి ఈ ప్రతిపాదనని ఆహ్వానిస్తారని మరికొంతమంది బీజేపీ నేతలు నమ్ముతున్నారంట.

అదేవిధంగా… పవన్ కళ్యాణ్ పదవుల కోసం పాకులాడే నాయకుడేమీ కాదని.. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా పురందేశ్వరి నాయకత్వాన్ని ఆమోదిస్తారని.. అవసరమైతే పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన శాఖకి కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంటుందని.. ఆ ప్రతిపాదనతో ముందుకు వెళితే జనసేన శ్రేణులు కూడా ఆహ్వానించవచ్చు అనే ఆలోచన కూడా నడుస్తోందని అంటున్నారంట.

దీంతో రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ – జనసేన పొత్తు నడుస్తూ… సీఎం అభ్యర్థిగా పురందేశ్వరిని ప్రతిపాదించడంతోపాటు.. ఆ ప్రతిపాదనను పవన్ తో నే చెప్పించే ఆలోచనలో కూడా ఉన్నారని అంటున్నారు. మరి ఈ ఆలోచన ఏ మేరకు కార్యరూపం దాల్చబోతుందనేది వేచి చూడ్దాలి.

కాగా… యూపీయే – 2 హయాంలో చిరంజీవి కేంద్ర పర్యాటన శాఖా మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు పవన్ కి కూడా అలాంటి ఒక పదవి ఇస్తే బెటరని కేంద్రంలోని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు.