మహిళాలోకంపై పవన్ మనసులో మాట ఇది!

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు శుభాకాంక్షలు చెప్పారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా మహిళా మూర్తిని కొనియాడుతూ.. వారికి కొన్ని ప్రామిస్ లు కూడా చేశారు పవన్ కల్యాణ్. దీంతో… పవన్ ను అభినందిస్తూ.. కొన్ని సూచనలు చేస్తుంది మహిళా లోకం!

“మాన‌వ సృష్టికి మూల‌కారిణి స్త్రీ. మహోన్నతమైన స్త్రీకి మ‌నం ఏమిస్తే రుణం తీరుతుంది. త‌ల్లిగా, తోబుట్టువుగా, భార్యగా, బిడ్డగా భిన్న రూపాల్లో మ‌న మ‌ధ్య ఉన్న స్త్రీ మూర్తివి సేవ‌లు వెల‌క‌ట్టలేనివి. మ‌హిళామ‌ణి లేని ఇల్లు దీపం లేని కోవెల వంటిది. మ‌హ‌త్త‌ర‌మైన వ‌నితాలోకానికి మ‌హిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్త్రీల‌ను గౌర‌వించే చోట శాంతిసౌభాగ్యాలు విల‌సిల్లుతాయ‌ని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు జ‌ర‌గ‌ని స‌మాజం ఆవిష్కృతం కావ‌డానికి ప‌క‌డ్బందీ చర్యలు చేప‌ట్టాలి. స్త్రీ ఆర్థిక స్వావ‌లంబ‌న‌తో స్వశక్తిపై నిల‌బ‌డాల‌న్నా, సాధికార‌తా సాధించాల‌న్నా చట్టసభల్లో వారి సంఖ్యా బ‌లం పెర‌గాల్సిన అవ‌స‌రం వుంద‌ని నేను ప్రగాడంగా న‌మ్ముతున్నాను. చట్టసభల్లో మ‌హిళ‌లకు 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించే దిశ‌గా నా రాజ‌కీయ ప్రయత్నం చిత్తశుద్ధితో కొన‌సాగుతుంది.. ఇప్పటికే ఈ అంశాన్ని మా పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిన విషయం ఆడపడుచులకు తెలిసిందే”!

ఇలా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్! ఈ ప్రకటనలో స్త్రీ గురించి గొప్పగా చెప్పడం.. అనంతరం మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు జ‌ర‌గ‌ని స‌మాజం ఆవిష్కృతం కావాలని కోరుకోవడం జరిగింది. అయితే.. ఈ సందర్భంలో చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ టాపిక్ ని కూడా టచ్ చేశారు జనసేన అధినేత. అందుకు తన రాజకీయ ప్రయత్నం చిత్తశుద్ధితో కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీంతో… పవన్ కు కొన్ని సూచనలు చేస్తుంది మహిళాలోకం!

చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని పవన్ కోరడం శుభపరిణామనని అభినందనలు చెబుతున్న మహిళా లోకం… ఆ బిల్లు అమలుచేయాల్సింది తాను పొత్తులో ఉన్న కేంద్రంలోని బీజేపీ అని గుర్తుచేస్తున్నారు. ఈ విషయాలు మోడీతో మాట్లాడగలిగే స్థాయి ఉన్న పవన్.. అమిత్ షాను ఒప్పించగలిగే శక్తి ఉన్న పవన్.. తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచిస్తున్నారు. పవన్ అనుకుంటే కచ్చితంగా అవుతాది అనేది వారి నమ్మకంగా చెబుతున్న పరిస్థితి!

ఇక మరో రకంగా కూడా చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ విషయంలో తన చిత్తశుద్ధిని నిరూపించుకునే అవకాశం ఉందంటూ ఒక సలహా ఇస్తుంది మహిళాలోకం. రాబోయే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు సంబందించి ఇప్పటివరకూ జనసేన ఎలాంటి ప్రకటనా చేయలేదు కాబట్టి… రానున్న ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల‌కు తమపార్టీ నుంచి 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీకి, పార్లమెంటుకు సీట్లు కేటాయించాలని కోరుతున్నారు. తద్వారా… తనకు మహిళాలోకంపై ఉన్న చిత్తశుద్ధిని సమాజానికి తెలియజేసినట్లు అవ్వడంతోపాటు.. గతంలో మహిళల గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు కూడా మన్నించబడే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. దానివల్ల మహిళాలోకంలో రియల్ హీరోగా నిలుస్తారనేది వారి సూచన అట!

మరి పవన్ కల్యాణ్ చెప్పిన చిత్తశుద్ధి అనేది మాటలవరకే ఉంటుందా.. లేక, చేతల్లో కూడా కనిపిస్తుందా అన్నది వేచి చూడాలి!

YouTube video player