సాక్షి జర్నలిస్టుకి పవన్ కళ్యాణ్ క్లాసు పీకారేంటబ్బా.!

తెలుగు మీడియా ఎలా వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీడీపీ అను‘కుల’ మీడియా, వైసీపీ అను‘కుల’ మీడియాగా విడిపోయింది. మరి, జనసేన అను‘కుల’ మీడియా లేదా.? అంటే, అదీ వుంది. అనుకూల మీడియాని, అను‘కుల’ మీడియాగా రాజకీయ పార్టీలే మార్చేస్తున్నాయి.

ఇంతకీ, న్యూట్రల్ మీడియా సంగతేంటి.? అది వున్నా లేనట్టే.! రాజకీయాలు అలా మారిపోయాయ్. ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రధాన మీడియా సంస్థల్ని నడుపుతున్నాయి. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇదే వాస్తవం. జర్నలిస్టులకు ఇష్టం లేకపోయినా, ఆయా మీడియా సంస్థల్లో, ఆయా మీడియా సంస్థల యాజమాన్యాల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోక తప్పడంలేదు.

ఆయా మీడియా సంస్థల మీద రాజకీయ పెత్తనం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. విశాఖలో ప్రెస్ మీట్‌లో జనసేన అధినేత మాట్లాడుతూ, ‘మీ ఓనర్..’ అంటూ సాక్షి జర్నలిస్టుని ఉద్దేశించి క్లాస్ పీకారు. ‘నేనేమీ మీ ఓనర్‌లా ఫలానా మీడియా లేదా ఫలానా జర్నలిస్టుని బ్యాన్ చేయను..’ అని జనసేన అధినేత చెప్పుకొచ్చారు.

ఈ విషయమై జర్నలిస్టు వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నిజమే, జర్నలిస్టుల్ని కూడా ప్రధాన రాజకీయ పార్టీలు ఫలానా పార్టీ సానుభూతిపరుల.. అన్నట్లుగానే చూస్తున్నాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే, రాజకీయ ప్రత్యర్థుల్లా జర్నలిస్టుల్ని చూస్తున్నారు రాజకీయ నాయకులు.

ఈ ధోరణి మారాల్సిందే. యధా రాజకీయం.. తథా మీడియా అయిపోయింది. పవన్ కళ్యాణ్ చెప్పింది మంచి మాటే అయినా, జర్నలిస్టుల్లో మార్పు వచ్చేందుకు అవకాశం లేదు. మారాల్సింది మీడియా సంస్థలు. వాటిపై రాజకీయ పెత్తనం వున్నన్నాళ్ళూ పవన్ కళ్యాణ్ కాదు కదా, ఇంకెవరు క్లాస్ పీకినా అది దండగే.

#@AkBigNews సాక్షి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కౌంటర్... పవన్ కళ్యాణ్