ఆ ఒక్కటీ అడక్కు… !

వారాహి యాత్ర అనంతరం జనసేన దూకుడు పెంచినట్లు కనిపిస్తుంది. పైగా ఆ సభలకు జనాలు విపరీతంగా రావడం, మీడియాలో సైతం మైలేజ్ బాగా రావడంతో జనసేనాని హ్యాపీగా ఉన్నారని తెలుస్తుంది. కాకపోతే నిలకడ లేని వాగ్ధానాలు, పోంతనలేని స్టేట్ మెంట్లతో కాస్త ఆలోచనా శక్తి ఉన్నవారిని మాత్రం పవన్ ఇంకా ఆకర్షించలేకపోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఆ సంగతి అలా ఉంటే… వారాహియాత్రలో భాగంగా పవన్ చెప్పిన బలమైన స్టేట్ మెంట్ ఇప్పుడు టీడీపీలో టెన్షన్ పుట్టిస్తుందని అంటున్నారు.

అవును… వారాహియాత్రలో భాగంగా అధికార వైసీపీపై పవన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో చంద్రబాబు పాలనను ప్రస్థావించే సాహసం చేయకుండా… జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో స్పందించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో వీరి పొత్తు పక్కా అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి! అది కన్ ఫాం అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ సమయంలో వారి విశ్లేషణలను, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే… ఇప్పుడు గోదావరి జిల్లాల్లో పవన్ ఇచ్చిన ఒక స్టేట్ మెంట్ ఆసక్తిగా మారింది. జనసేన వారాహియాత్రలో భాగంగా సభల్లో మైకందుకున్న పవన్… ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్కసీటు కూడా రానివ్వొద్దని ప్రజలను కోరారు. 34 సీట్లలో ఒక్కటి కూడా వైసీపీకి రాకుండా జనసేన వ్యూహాలు పన్నుతుందని అన్నారు. ఫలితంగా వైసీపీ రహిత గోదావరి తన లక్ష్యమని ప్రకటించారు.

దీంతో ఇక్కడే ఉంది అసలు సమస్య అంటూ అటు టీడీపీ నేతలు, ఇటు వైసీపీ నేతలు కూడా పవన్ పై ప్రత్యక్షంగా కొందరు పరోక్షంగా కొందరు ప్రశ్నలు ఎక్కుపెడుతున్నారు. వైసీపీకి ఓటెయ్యొద్దు సరే… జనసేనకు మాత్రమే వెయ్యాలా, టీడీపీకి కూడా వెయ్యాలో ఓటర్లకు క్లారిటీ ఇవ్వమని కోరుతున్నారు. వైసీపీ వద్దు సరే… టీడీపీ ముద్దా, జనసేన ముద్దా అనేది పవన్ చెప్పాలని డిమాడ్ చేస్తున్నారు. అయితే “ఆ ఒక్కటీ అడక్కు” అనే టైపులో పవన్ ఈ విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు!

ఆ సంగతి అలా ఉంటే… ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 34 సీట్లలోనూ జగన్ గెలవకూడదని కోరుకుంటున్న పవన్… టీడీపీ తనకు ఎన్ని సీట్లు ఇస్తుందని అనుకుంటున్నారంటూ ఆఫ్ ద రికార్డ్ ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. పొత్తులో భాగంగా చంద్రబాబు.. పవన్ కి సీట్లు కేటాయిస్తారా… లేక, పవనే చంద్రబాబుకు సీట్లు ఆఫర్ చేస్తారా.. అని అంటున్నారు. ఈ విషయం మరిచిన పవన్… మెజారిటీ సీట్లలో జనసేనే పోటీ చేయబోతుందన్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారని.. ఫలితంగా టీడీపీ కేడర్ ను ఆందోళనకు గురిచేస్తున్నారని అంటున్నారు.

జగన్ ని విమర్శించడం వరకూ ఓకే కానీ… ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన మాత్రమే పోటీ చేయబోతుందన్నట్లుగా సంకేతాలిచ్చి మొదటికే మోసం చేసే ప్రయత్నాలు మానుకోవాలని సూచిస్తున్నారని తెలుస్తుంది. మరి పవన్ ఈ విషయాలపై జనసైనికులకు, ప్రజలకు ఎప్పుడు క్లారిటీ ఇస్తారు అనేది ఇప్పుడు కీలకంగా మారిందని అంటున్నారు. అలా కాకుండా ఎన్నికలకు సమయం మరింత దగ్గరైన తర్వాత ప్రకటిస్తే…. టీడీపీ – జనసేనల పరిస్థితి పిలి పిల్లీ దెబ్బలాడుకున్నట్లుగా అయిపోతుందని హెచ్చరిస్తున్నారంట.

మరి పవన్ కల్యాణ్ “ఆ ఒక్కటీ అడక్కు!” నుంచి ఎప్పుడు బయటకు వచ్చి ప్రజలకు క్లారిటీ ఇస్తారనేది వేచి చూడాలి. ఒంటరిగానా.. పొత్తులోనా.. ఓన్లీ గోదావరి జిల్లాలేనా.. రాష్ట్రమంతానా.. గోదావరి లో మాత్రమే అయితే మొత్తమా.. బాబు దయా.. అనే ప్రశ్నలకు ఎంత త్వరగా సమాధానం చెబితే అంత మేలని అంటున్నారు!