ప్రస్తుతం వారాహి యాత్రలో భాగంగా ఫుల్ బిజీగా ఉన్నారు పవన్ కల్యాణ్. ఈ యాత్రలో భాగంగా ఇప్పటికే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సభలూ, సమావేశాలూ పూర్తవగా.. ప్రస్తుతం వెస్ట్ గోదావరిలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా పవన్ మైకందుకున్న ప్రతీసారీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకం పై స్పందించారు.
ఆరోగ్య శ్రీ పథకం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ మదిలో మెదిలిన ఒక అద్భుతం. పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో అప్పట్లో ఈ పథకం ప్రారంభమైంది. ఈ పథకం గురించి అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడిచింది. వైఎస్సార్ సంక్షేమ ఆలోచనలపట్ల దేశవ్యాప్తంగా అభినందనలు వచ్చాయి.
ఫలితంగా… వైఎస్సార్ మరణం తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుసైతం ఈ విషయంలో రిస్క్ తీసుకోలేదు. వైఎస్సార్ పథకాన్ని కొనసాగిస్తూనే పాలన సాగించారు. ఇంతకంటే గొప్పపథకం తీసుకొస్తాననే చిల్లర మాటలు మాట్లాడలేకపోయారు. ఇది వైఎస్సార్ ఘనత! ఆయన పథకాలకున్న ఆధరణ! అనంతరం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పథకాన్ని మరింత అభివృద్ధి చేశారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకంలోకి అనేక అనేక దీర్ఘ రోగాలను కూడా కొత్తగా జత చేశారు. దీనివలన ఎలాంటి ఆరోగ్య ఇబ్బంది ఉండే వారికి కూడా కార్పొరేట్ చికిత్సలపరంగా లోటు ఉండకుండా చేశారు. దీని అదనంగా మరికొన్ని పథకాలను ఆరోగ్యశాఖలో అమలుపరిచారు. గ్రామస్థాయిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రలను అభివృద్ధి చేశారు.
ఈ సమయంలో మైకందుకున్న పవన్… జనసేన అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీని మించిన ఇన్సూరెన్స్ పథకం ప్రజల కోసం తీసుకువస్తాను అంటూ ఘనమైన హామీ ఇచ్చారు. దీంతో… పవన్ పై పలు ప్రశ్నలు సంధిస్తున్నారు పరిశీలకులు. ఈ పథకంపై ప్రజల్లో ఎలాంటి ఫిర్యాదు లేనప్పుడు, ఎటువంటి అసంతృప్తి లేనప్పుడు… ఈ పథకాన్ని మార్చాల్సిన అవసరం ఏమిటో పవన్ చెప్పాలని అంటున్నారు.
ఇదే సమయంలో… ఇంతకంటే మెరుగైన పథకం తెస్తానని ప్రజలను మభ్యపెట్టడం ఎలా సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ ఊహించారో తెలియాలి. జగన్ చేయకుండా మిగిలిపోయిన పనులు, ఎన్నికల్లో మాట ఇచ్చి నెరవేర్చని హామీల గురించి ఏదైనా వాగ్దానాలు చెబితే ఎంతోకంత ప్రయోజనం ఉండొచ్చు కానీ… ఆరోగ్యశ్రీ లాంటి మంచి పథకం, అద్భుతంగా అమలవుతున్న పథకం గురించి టంగ్ స్లిప్ అయితే ఉన్న గౌరవం పోవడం తప్ప పవన్ కు మిగిలేది ఏమి ఉంటుంది అనేది మరో ప్రశ్న.
ఇలా అర్థజ్ఞానానికి అజ్ఞానానికి మధ్య నలిగిపోయే టైపు మాటలు మాట్లాడటం వల్లే… పవన్ ను సీరియస్ పొలిటీషియన్ గా ప్రజలు పరిగణలోకి తీసుకోవడం లేదనేది మరో కామెంట్. మరి… ఇకనైనా ఆరోగ్య శ్రీ వంటి సక్సెస్ ఫుల్ పథకాల విషయంలో రిస్క్ స్టేట్ మెంట్లు ఇవ్వకుండా… ఏవైనా కొత్త ఆలోచనలు చేయాలని.. లేకపోతే చంద్రబాబు తొలివిడత మేనిఫెస్టోలో చెప్పినట్లు కర్ణాటకలో సక్సెస్ అయిన ఏదైనా హామీలు అయినా చెప్పుకోవాలని సూచిస్తున్నారు పరిశీలకులు.