ప్రస్తుతం వైసీపీని కలవరపెడుతున్న అంశం పవన్ కళ్యాణ్. రైతుల కోసం రోడ్డెక్కి పవన్ చేసిన రోడ్ షో వైసీపీ కీలక నేతలను కదిలించింది. నివారు తుఫాన్ బాధితులకు నష్టపరిహారం అందించాలని లేకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని పవన్ హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో పాటు కొందరు నాయకులను మాత్రమే టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. చాలారోజుల తర్వాత పవన్ బయటికొచ్చి చేసిన ఈ రోడ్ షోకు విశేష స్పందన వచ్చింది. జనం స్పందనతో పాటు అధికార పార్టీలో కూడ విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుండి మంత్రి వర్గంలోని ముఖ్య నేతలంతా పవన్ మీద విరుచుకుపడిపోయారు. అయితే ఈ విరుచుకుపడేటప్పుడు ఎప్పటిలాగే పెడద్రపు ధోరణిలోనే మాట్లాడారు. కానీ పవన్ మాటలకు మొత్తం జగన్ కేబినెట్ కదిలిపోవడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
పవన్ ఒక్కసారి రోడ్డెక్కితే జగన్ మంత్రి వర్గం మొత్తం కదిలిపోయిందిగా !
పవన్ గతంలో కేవలం పాలసీల గురించి, అవతలివారి తప్పుల గురించే మాట్లాడేవారే తప్ప మరే అంశాల జోలికి వెళ్ళీవారు కాదు. మరీ ముఖ్యంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఎప్పుడూ విమర్శలు చేయలేదు. కానీ ఈసారి చేశారు. నాని పేరును మాత్రమే ప్రస్తావించి ఇంటి పేరును వదిలేయడంతో వైసీపీలో ఉన్న నానిలు అందరికీ తగిలాయి పవన్ మాటలు. శతకోటి లింగాల్లో ఒక బోడిలింగం అంటూ పవన్ మాట్లాడేసరికి నానిలకు చిర్రెత్తుకొచ్చింది. పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని అనేసరికి కోపం నషాళానికి అంటింది. ఇక అసెంబ్లీని ముట్టడిస్తామని అల్టిమేటం పెట్టేసరికి అధికార పార్టీ అహం దెబ్బతినేసింది. అందుకే ఆలస్యం లేకుండా మీడియా ముందుకొచ్చేశారు.
ముందుగా సంప్రదాయం ప్రకారం పవన్ సామాజికవర్గానికి చెందిన నేతలు దాడిని స్టార్ట్ చేశారు. మంత్రి కురసాల కన్నబాబు బయటకొచ్చి రైతులకు మేలు చేసే విషయంలో వేరొకరితో చెప్పించుకునే స్థాయిలో వైసీపీ ప్రభుత్వం లేదని అన్నారు. అక్కడి నుండి వరుస పెడితే కొడాలి నాని మాట్లాడుతూ పాత పాటే పాడారు. పవన్ చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకుని పనిచేస్తున్నాడని ప్యాకేజీ స్టార్ అని అన్నారు. చంద్రబాబు వద్ద పవన్ డబ్బు పుచ్చుకున్నారని అప్పుడెలా ఆధారాలు చూపలేకపోయారో ఈసారి కూడ అంతే. వేరే కారణాలు దొరక్క నిరాధార విమర్శ ఒకటి చేసేశారు. మరో మంత్రి పేర్ని నాని చిడతలు నాయుడు అంటూ ఎద్దేవా చేయగా వెల్లంపల్లి శ్రీనివాస్ సినిమాల్లో డబ్బు తీసుకుని ఎలా నటిస్తారో రాజకీయాల్లో కూడ పవన్ అలాగే డబ్బు తీసుకుని నటిస్తున్నాడని అన్నారు.
ఇక అవంతి శ్రీనివాస్ అయితే అసలు పవన్ అసెంబ్లీని ఎందుకు ముట్టడిస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఎక్కడ పవన్ గురించి మాట్లాడితే ఆయన స్థాయి పెరిగిపుతుందోనని భావించే వైఎస్ జగన్ ఈసారి నేరుగా మాట్లాడారు. రైతులకు పరిహారం ఇస్తున్నామని తెలిసే చంద్రబాబు దత్తపుత్రుడిని రంగంలోకి దింపారని అన్నారు. ఇలా కీలక నేతలంతా నేరుగా పవన్ ను ఎలా విమర్శించాలో తెలియక చంద్రబాబుకు లింక్ పెట్టే మాట్లాడారు. వారి మాటలు విన్న జనం సైతం ఇంకెన్నాళ్లు ఈ లింక్ విమర్శలు అంటున్నారు. జనసేన శ్రేణులైతే పవన్ ఒక్కసారి గట్టిగా మాట్లాడేసరికి సీఎం నుండి కేబినెట్ వరకు కదిలిపోయిందే, ఇక అసెంబ్లీ ముట్టడి చేస్తే ఏం చేస్తారో అంటూ సోషల్ మీడియాలో పంచ్ డైలాగులు పేల్చుతున్నారు.