జనసైనికులకు క్లారిటీ ఇచ్చేసిన పవన్!

రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని అడ్డుకుంటానని.. పరోక్షంగా చంద్రబాబుని సీఎం చేయడమే తన ధ్యేయమని చెప్పుకొచ్చిన పవన్… తాజాగా జనసైనికులకు పరోక్షంగా ఒక క్లారిటీ ఇచ్చినట్లే అని అంటున్నారు విశ్లేషకులు. తాజా పరిణామాలను, గతకొంతకాలంగా పవన్ వ్యవహార శైలిని క్షుణ్నంగా పరిశీలించిన వారు.. ఈ మేరకు సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు.

అవును… “మన కోసం తపించేవారే మనవారు అవుతారు కానీ.. చుట్టపుచూపుగా వచ్చి పోయే వారు మనవారు ఎలా అవుతారు?” అనే అంశాన్ని తాజాగా తెరపైకి తెస్తున్నారు విశ్లేషకులు. ఏపీలో అధికారపార్టీ నిత్యం జనాల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. ఏదో ఒక కార్యక్రమం పేరుచెప్పి… నియోజకవర్గ ప్రజలకు టచ్ లో ఉంటున్నారు ఎమ్మెల్యేలు. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా వీలైనన్ని సభలు, సమావేశాలు పెట్టుకుని జనాలకు టచ్ లో ఉంటుంది.

ఏపీలో రెండు ప్రధాన పార్టీల పరిస్థితి అలా ఉంటే… జనసేన మాత్రం స్థబ్ధగా ఉంది! ఒక్క కార్యక్రమం లేదు.. ఒక్క భారీ బహిరంగ సభా లేదు. కేడర్ లో కదలికలు తెచ్చే ఒక్క కార్యక్రమాన్ని కూడా జనసేన అధినేత తలపెట్టలేకపోతున్నారు. పోనీ పాలిటిక్స్ ని పార్ట్ టైం జాబ్ గా తాను భావించి షూటింగుల్లో బిజీగా ఉంటే… మిగిలిన నాయకులకైనా బాధ్యతలు అప్పగించి ఉండొచ్చు. ప్రతిఫలంగా పార్టీలో కేడర్ లో కాస్త ఉత్సాహం కలిగిస్తూ, ఎన్నికల వేడి తగ్గకుండా చూసుకోవచ్చు.

కానీ పవన్ మాత్రం అలాంటి పనులేమీ చేయడం లేదు. ఫలితంగా… “మీపని మీరు చూసుకోండి.. నా పని నేను చూసుకుంటాను. సభ అని పిలిస్తే బళ్లేసుకుని రండి.. చెప్పింది వినండి.. కుదిరితే కేకలెయ్యండి.. వీలైతే విజిల్స్ వేయండి.. ఎన్నికల్లో నేను చెప్పినోళ్లకు ఓటెయ్యండి.. వరుసగా రాబోతున్న సినిమాలను ఆదరించండి..” అని ఫ్యాన్స్ కు పరోక్షంగా చెబుతున్నట్లుందని అంటున్నారు విశ్లేషకులు.

మరి విశ్లేషకులు చెబుతున్న ఈ విషయానికి బలం చేకూర్చేలాగానే పవన్ పద్దతి ఉండబోతుందా… లేక, ముఖానికి రంగు తుడిచేసుకుని, వారాహిని బయటకు తీసి జనాల్లోకి బయలుదేరతారా అన్నది వేచి చూడాలి!