నమ్ముకున్నోళ్లను ముంచనున్న పవన్.. ఇంతకంటే క్లియర్ గా ఎలా చెప్పాలి?

చెప్పే మాటలకూ చేసే పనులకూ పొంతనలేకుండా ప్రవర్తించే వ్యక్తులు చాలా మందే ఉంటారు! ఇదే సమయంలో ఇలాంటి లక్షణాలు ఉండే రాజకీయ నాయకులకైతే అసలు కొదవే ఉండదని చెబుతుంటారు. ఈ సమయంలో మార్పుకోసం రాజకీయాల్లోకి వచ్చానని ఇంతకాలం చెప్పుకున్న పవన్… తాను చదివిన పుస్తకాలంటే చంద్రబాబు రాజకీయ తెలివితేటల ప్రభావమే తనపై ఎక్కువగా ఉందనిపించేలా ఒక విషయం తెరపైకి వచ్చింది!

అవును… అభ్యర్థులకు టిక్కెట్లు కన్ ఫాం చేసే విషయంలో చంద్రబాబు వ్యవహార శైలిని చాలామంది టీడీపీ నేతలే తప్పుబడుతుంటారు. పార్టీని కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకుని, కార్యకర్తలను కాపాడుకుంటూ నడిపించిన నాయకులకు హ్యాండ్ ఇస్తుంటారని చెబుతుంటారు. కాస్త డబ్బున్న వ్యక్తి పార్టీలోకి వస్తే… ఇంతకాలం పనిచేసిన నేతను కరివేపాకులా పక్కన పెట్టేస్తారని చెబుతుంటారు. అయితే తాజాగా పవన్ కు కూడా ఇలాంటి లక్షణాలే వచ్చినట్లున్నాయని అంటున్నారు పరిశీలకులు.

ఇటీవల జనసేనకు సంబంధించి ఒకటి రెండు నియోజకవర్గాల్లో టికెట్లు ఖాయం చేశారు పవన్ కల్యాణ్. మరికొన్ని చోట్ల ఇన్ చార్జ్ లను ప్రకటించారు. వీరిలో ఎక్కువ మంది పక్క పార్టీల నుంచి వచ్చినవారే ఉండటం విశేషం. ఉదాహరణకు కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన ఇన్ ఛార్జ్ గా నియమింపబడిన టీవీ రామారావు… టీడీపీ మాజీ నేత! ఇలా మార్పుకోసం అంటూ చెప్పుకొచ్చిన పవన్… పక్క పార్టీ నేతలను ఆహ్వానిస్తున్నారు.

అప్పటికప్పుడు కండువా కప్పడం, ఫలానా నియోజకవర్గం నీకే అని చెప్పడం ఇదీ పవన్ సిద్ధాంతంగా ఉంది. దీంతో… మరి ఇంతకాలం పార్టీని నమ్ముకున్నోళ్ల సంగతేంటి..? అనే కామెంట్లు వినిపించాయి. సుమారు గత పదేళ్లుగా పార్టీని కాపాడుకుంటూ వస్తోన్న నాయకుల పరిస్థితి ఏమిటనే చర్చ వచ్చింది. అయితే తాజాగా వారికి క్లారిటీ ఇచ్చేశారు జనసేనాని.

ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోన్న విశాఖ వారాహి యాత్రకోసం పవన్ కల్యాణ్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన క్రియాశీలక నేతల మీటింగ్ లో హితోపదేశం చేశారు. జనసేన నేతలకు త్యాగం, బాధ్యత, జవాబుదారీతనం ఉండాలని మెల్లగా మొదలుపెట్టారు. తమ సొమ్ము ప్రజలకు పంచే నేతలు కావాలని పవన్ చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో డబ్బుతో ఓట్లు కొనాలని తాను చెప్పడం లేదని చెప్పిన పవన్… నాయకులు కావాలంటే డబ్బు ఖర్చు పెట్టి తీరాలని స్పష్టం చేశారు. రూపాయి ఖర్చు చేయకుండా ఎవరూ నాయకులు కాలేరని తెనదైన రాజకీయ జ్ఞానాన్ని ప్రదర్శించారు. ఇదే సమయంలో మంచి వారినే పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. అలాంటి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని.. ఇప్పటికే నియోజకవర్గాల్లో ఎన్నో ఆశలతో ఉన్నవారికి దిశా నిర్దేశం చేశారు.

అనంతరం కొత్తవారు వస్తుంటే, ఉన్నవారు ఉడుక్కోవద్దని తేల్చి చెప్పిన పవన్… ఖర్చుపెట్టుకోగలిగే వారే నాయకులవుతారని, అలాంటి వారిని పార్టీ ప్రోత్సహిస్తుందని పరోక్షంగా చెప్పేశారు. పొత్తుల ఎత్తుల్లో సీట్లు దక్కవు అని ఈపాటికే చాలామంది జనసేన ఔత్సాహిక నేతలు డిసైడ్ అయిన నేపథ్యంలో… ఇంతకాలం పార్టీని నమ్ముకుని కాపాడూంటూ వచ్చిన పాతవారిని మరింత వెనక్కు నెట్టేస్తారనే సంకేతాలు ఇచ్చారని అంటున్నారు పరిశీలకులు.