తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి జైలు నుంచి విడుదలయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అసభ్యకరమైన రీతిలో బూతులతో విరుచుకుపడిన కేసులో పట్టాభిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం విదితమే. పట్టాభిని వైద్య పరీక్షల అనంతరం పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
బెయిల్ రావడంతో పట్టాభి ఈ రోజు సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలయ్యే సమయంలో పట్టాభి సాధారణంగానే కనిపించారు. టీడీపీ శ్రేణుల హంగామా పెద్దగా కనిపించలేదు.
ఇదిలా వుంటే, పట్టాభి చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతూనే వుంది. పట్టాభి వ్యాఖ్యల నేపథ్యంలోనే వైసీపీ శ్రేణులు ఆయన ఇంటిపై దాడికి దిగారు. మరోపక్క, టీడీపీ రాష్ట్ర కార్యాలయంపైనా వైసీపీ దాడి చేసింది. ఈ క్రమంలో పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
అటు వైసీపీ కార్యకర్తల అరెస్టులు, ఇటు పట్టాభి బెయిల్ మీద విడుదలవడంతో వైసీపీ శ్రేణుల్లో కొంత అలజడి కనిపిస్తోంది. వైసీపీ కార్యకర్తల్లో అరెస్టయినవారంతా కింది స్థాయి వ్యక్తులే కావడం గమనార్హం. వారిని ఎవరు ప్రేరేపించారు.? అన్నది విచారణలో తేలాల్సి వుంది.
కాగా, పోలీసులు పట్టాభిని అరెస్టు చేశారుగానీ, దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్తల్ని, ఆ దాడులకు కారణమైన వైసీపీ నేతల్నీ అరెస్టు చేయడం లేదంటూ టీడీపీ నానా యాగీ చేస్తూ వచ్చింది. ఇంతలోనే వైసీపీ కార్యకర్తల అరెస్టు అంశం తెరపైకొచ్చింది.
వీడియో ఫుటేజీల ఆధారంగా పోలీసులు అరెస్టుల ప్రక్రియను షురూ చేశారు. ఇప్పటిదాకా 20 మందికి పైగా వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ‘దాడి చేసుకున్నది టీడీపీనే.. టీడీపీ కార్యకర్తలే ఆ దాడికి పాల్పడి వుంటారు..’ అని హోంమంత్రి, టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు ప్రకటించారు.. మరి, పోలీసులు వైసీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయడమేంటి.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది.