తమిళనాడు, కర్నాటకల్లో జగన్ నిర్ణయాలపై హర్షం

జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను ప్రతిపక్షాలైన తెలుగుదేశంపార్టీ, జనసేనలు స్వాగతించకపోయినా తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో మాత్రం హర్షం వ్యక్తమవుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లోను అంతుకుముందు మంత్రివర్గం ఏర్పాటులోను జగన్ రెండు కీలక నిర్ణయాలను తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

మంత్రివర్గం ఏర్పాటు సందర్భంగా ఐదు సామాజికవర్గాలను బ్యాలెన్స్ చేయటం కోసం ఐదుగురిని ఉపముఖ్యమంత్రులను చేశారు.  ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల ఫార్ములాపై  అప్పట్లో దేశమంతా చర్చ జరిగింది. ఐదు డిప్యుటి సిఎంలను జగన్ బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి, కాపు సామాజివర్గాలకు కేటాయించారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కర్నాటకలోని కొన్ని రాజకీయ  పార్టీలు స్వాగతించాయి.

అలాగే మొన్నటి అసెంబ్లీలో బిసి, ఎస్సీ, ఎస్టి,  మైనారిటి, మహిళలకు నామినేటెడ్ కాంట్రాక్టుల్లో 50 శాతం పనులను కేటాయించాలని ప్రత్యేకంగా ఓ చట్టమే తెచ్చారు. అలాగే, మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించే మరో చట్టం కూడా తెచ్చారు. ఈ నిర్ణయాన్ని తమిళనాడులోని పార్టీలో స్వాగతించాయి.

కర్నాటకలో కొత్తగా సిఎంగా బాధ్యతలు తీసుకున్న యడియూరప్పను ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల ఫార్ములాను అనుసరించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయమై ఎంఆర్పిఎస్ కర్నాటక అధ్యక్షుడు హెచ్. హనుమంతప్ప మాట్లాడుతూ తన మంత్రివర్గంలో కూడా యడియూరప్ప ఐదుగురు ఉపముఖ్యమంత్రులను తీసుకోవాలని డిమాండ్ చేయటం గమనార్హం.