AP: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు సంచలనం గానే ఉంటాయి. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కూటమి నేతల మధ్య అలజడి మొదలైందని స్పష్టం అవుతుంది. ఈ క్రమంలోనే ఎన్ని రోజులు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ని తొలగించి ఆ పదవి నారా లోకేష్ కి ఇవ్వాలి అంటూ డిమాండ్లు కూడా వచ్చాయి అయితే ఈ వివాదానికి పూర్తిస్థాయిలో చెక్ పెట్టారు. ఇక తరచూ కూటమి ప్రభుత్వంపై వైకాపా విమర్శలు వైకాపాపై కూటమి విమర్శలు చేయడం సర్వసాధారణం.
ఇదిలా ఉండగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కొంతమంది నేతలు ఎన్నికలకు ముందు కూటమిలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా కూటమి పార్టీలో పోటీ చేసి ప్రస్తుతం మంత్రులుగా ఎమ్మెల్యేలుగా కూడా కొనసాగుతున్నారు అలాంటి వారిలో మంత్రి పార్థసారథి కూడా ఒకరు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి ఈయన ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు.
ఇలా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే తాజాగా ఈయన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గురించి ఈయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాను ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసి మాట్లాడాను అయితే ఆ సమయంలో ఆయనకు నేను కొన్ని ప్రశ్నలు కూడా వేశానని తెలిపారు.
బయట చంద్రబాబు నాయుడు గారు అంటే కేవలం పారిశ్రామికవేత్తలకు అలాగే ఐటి ఉద్యోగులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని పేదవారి గురించి పట్టించుకోరనే దుష్ప్రచారం ఉంది కదా అంటూ నేను చంద్రబాబు గారిని ప్రశ్నించాను. అందుకు ఆయన స్పందిస్తూ పరిశ్రమలు ఐటీ బాగుంటేనే ఎన్నో కుటుంబాలు కూడా బాగుంటాయి అనే సమాధానం చెప్పారు.
ఆయన చెప్పిన ఈ సమాధానం నాకు ఎంతగానో నచ్చింది అదే ప్రశ్న తాను కనుక జగన్మోహన్ రెడ్డిని అడిగి ఉంటే ఆయన వెంటనే సిబ్బందిని పిలిపించి నన్ను మెడబట్టి బయటకు గెంటించేవారు అంటూ ఈ సందర్భంగా పార్థసారథి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
