అనంతపురం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకప్పుడు చక్రం తిప్పిన పెద్ద కుటుంబాలు ఇప్పుడు మౌనం పాటిస్తున్నాయి. పదవులు లేకపోవడం, పార్టీలు అధికారంలోకి రాకపోవడంతో ప్రత్యర్థుల చేతిలో నలిగిపోతున్నారు. ఇప్పటికే టీడీపీ సీనియర్ లీడర్ జేసీ కుటుంబాన్ని ముప్పుతిప్పలు పెట్టింది ప్రభుత్వం. అవినీతి పనులను బయటకు లాగి కేసులు వేయడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడితో సహా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో దివాకర్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఆయనలో మునుపు ఉన్న దూకుడు ఇప్పుడు లేదు. ఎగిరి ఎగిరి ఒక్కసారి కిందపడ్డట్టు అయిపోయారు. పైకి లేవాలనే ప్రయత్నం కూడ లేదు. ఏదో వారి వారసులు హడావుడి చేస్తున్నారు కానీ పెద్ద తలలు రెండూ రాజకీయాలను పక్కనపెట్టేసినట్టు ఉండిపోయారు.
వీరి తరహాలోనే పరిటాల ఫ్యామిలీ పరిస్థితి కూడ ఉంది. పరిటాల రవి హయాంలో రాయలసీమలో తెలుగుదేశం పూర్తిస్థాయి నామినేషన్ చూపించింది. అనంతపురం జిల్లాలో ఒంటిచేత్తో పార్టీని మెయింటైన్ చేసిన చరిత్ర పరిటాల రవీంద్రది. ఆయన మరణం తర్వాత రవి సతీమణి పరిటాల సునీత వారసత్వం తీసుకుని బాగానే నడిపారు. రాప్తాడు నుండి వరుసగా విజయాలు సాధించి నిలదొక్కుకున్నారు. ఇక గత ఎన్నికల్లో రవి వారసుడిగా శ్రీరామ్ ఎంట్రీ ఇచ్చి రాప్తాడు నుండి పోటీచేయగా ఓడిపోయారు. ఓటమి తర్వాత నుండి పరిటాల కుటుంబం కొద్దిగా నెమ్మదించింది. రాప్తాడులో, మొత్తం అనంతపురంలో రవి వర్గీయులు సరైన దశ దిశ లేకుండా ఉండిపోయారు. వైసీపీ బలంగా ఉండటంతో ఏ దశలోనూ పైచేయి సాధించలేకున్నారు.
అయితే శ్రేణులకు మాత్రం శ్రీరామ్ మీద గట్టి గురి ఉంది. ఓడినా కూడ ఆయనకు మద్దతుగానే ఉన్నారు. కొత్త లీడర్లు పుట్టుకొస్తున్నా, ఇబ్బందులు ఎదురవుతున్నా రవి వర్గీయులుగానే ఉన్నారు. సరైన సమయం దొరికి పరిస్థితులు కొద్దిగా అనుకూలిస్తే శ్రీరామ్ ఉవ్వెత్తున లేస్తారని, నిలదొక్కుకుపోతారని భావిస్తున్నారు. శ్రీరామ్ సైతం అనవసరమైన గొడవలు జోలికి పోకుండా విగ్రహాల కూల్చివేత లాంటి కవ్వింపు చర్యలు జరుగుతున్నా మౌనంగానే ఉంటున్నారు తప్ప హడావుడి చెయ్యట్లేదు. ఇదే ప్రత్యర్థులకు నచ్చట్లేదట. ఏదో ఒక విధంగా ఆయన్ను రెచ్చగొట్టి బుక్ చేసేయాలని చూస్తున్నారట. తాజాగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పరిటాల రవీంద్ర గురించి చేసిన సంచలన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అంటున్నారు.
నక్సలైట్లు, ఫ్యాక్షనిజం పేరుతో పరిటాల రవి ఎంతో మందిని నరికారని, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహకారంతో ఎమ్మెల్యేగా పరిటాల రవి ఇలాంటి పనులు చేశారని అన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో పొలాలకు నీరు లేక ఎండిపోతుంటే పరిటాల రవి రక్తపు టేర్లతో పొలాలను తడిపారని తీవ్ర ఆరోపణలు చేశారు. పంట పొలాలను రక్తంతో తడిపిన చరిత్ర పరిటాల రవిదని అన్నారు. మామూలుగా అయితే ఈ తరహా వ్యాఖ్యలకు పెద్ద గొడవలే జరిగిపోవాలి. కానీ పరిటాల శ్రీరామ్ సమన్వయంతో ఉండటంతో ప్రశాంతంగానే ఉంది. అదే ఈ వ్యాఖ్యలకు ఆయన రెచ్చిపోయి ఏదో ఒకటి మాట్లాడటమే, చేయడమో చేసి ఉంటే కేసులు, అరెస్టులు అంటూ అణగదొక్కుడు తతంగం మొదలయ్యేదే. ఈ సంగతి తెలిసే శ్రీరామ్ మౌనంగా ఉండిపోయారని, అదే మంచిదని ఆయన వర్గీయలు అంటున్నారు.