జ‌గ‌న్‌పై టీడీపీ అధికార ప్రతినిధి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీ వర్గాలకు ఏపీ సీఎం చంద్రబాబు అన్యాయం చేస్తున్నారంటూ పార్లమెంటు నియోజకవర్గాల కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. వీరు చేస్తున్న ధర్నాపై పంచుమర్తి అనురాధ స్పందించారు. వైసీపీ చేపట్టిన నిరసనలను ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్, దివంగత నేత వైఎస్సాఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆవిడ ఏం మాట్లాడారో కింద ఉంది చదవండి.

బీసీల గొంతు కోసిన కసాయి జగన్ మోహన్ రెడ్డి. గురజాలలో జంగా కృష్ణమూర్తిని కాదని వేరే అగ్రకులానికి చెందిన వారికి ఎమ్మెల్యే సీటు ఇవ్వడం ఇందుకు నిదర్శనం అన్నారు. అయినా జంగా కృష్ణమూర్తి టీడీపీపై విమర్శలు చేయడం హస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. స్థానిక నాయకత్వంలో బీసీ రిజర్వేషన్ 33 శాతానికి పెంచిన ఘనత చంద్రబాబు నాయుడిది. నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ ఉన్నప్పుడు ఉద్యోగాలలో బీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీఆర్ ది. ఎన్నికల సమయంలో ధర్నాలు చేసి లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోంది. ఈ చర్యలను ఖండిస్తున్నాం.

వైఎస్ఆర్ ప్రభుత్వంలో 23 జిల్లాలకు గాను బీసీలకు 3వేల కోట్లు ఖర్చుపెడితే… 13 జిల్లాలలోని బీసీల అభ్యున్నతికి 40 వేల కోట్లు ఖర్చు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంది. బీసీ నాయకత్వం పెంచే దిశగా ఎమ్మెల్యేలే కాకుండా నామినేషన్ పోస్టులు కూడా బీసీలకు కేటాయించారు. టీటీడీ ఛైర్మన్ వంటి కీలక పదవిని కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది. మూడు సార్లు టీటీడీ ఛైర్మన్ బీసీలకు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికే దక్కుతుంది. ఏనాడైనా వైఎస్ఆర్ బీసీలకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారా..? టీడీపీ ప్రభుత్వం స్వయం ఉపాది కింద రూ.1,124 కోట్లు ఖర్చుపెడితే.. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఖర్చు పెట్టింది కేవలం రూ.127 కోట్లు మాత్రమే అని గుర్తు చేశారు.

ఫెడరేషన్స్ అన్నీ కూడా నిర్వీర్యం చేశారు. చేనేత కార్మికులకు వైఎస్ఆర్ ఏం చేశారు? గీత కార్మికులను రద్దు చేసి రోడ్డు పడేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం కాదా..? అంటూ ఆమె ప్రశ్నించారు. వైఎస్ఆర్ ప్రభుత్వం రజకులకి చేసిందేమీ లేదు. కుమ్మరి, బట్లరాజులు అనేవారు ఉన్నారని కూడా వైఎస్ఆర్, జగన్ లకు తెలియదు అంటూ విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ మొట్టమొదటిగా తెచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది. బీసీలకు రూ.41వేల కోట్లు కేటాయించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ముఖ్యమంత్రి స్థాయి తర్వాత అంతటి స్థాయిలో ఉండే డిప్యూటీ సీఎం ఒక బీసీ.

మంత్రివర్గంలో 8 మందికి మంత్రి పదవులు కేటాయించారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న అరకొర మంత్రులను జైలు పాలు చేశారు.బీసీలను రాజకీయంగా, సామాజికంగా ఆదుకున్నది ఒక్క తెలుగుదేశం పార్టీనే. తెలుగుదేశం పార్టీకేదైనా మారుపేరు ఉందంటే అది బీసీల పార్టీ అని పేర్కొన్నారు పంచుమర్తి అనురాధ. కాగా ఆమె జగన్, వైఎస్సార్ పై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అభిమానులు మండి పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.