ఉగ్రవాదులకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ హెచ్చరిక

ఉగ్రవాద దాడులపై అంతర్జాతీయంగా పలు దేశాల నుంచి వస్తున్న ఒత్తిడికి పాకిస్థాన్ ఎట్టకేలకు తలొగ్గింది. పాక్ లోని ఇస్లామిస్ట్ ఉగ్రవాద సంస్థలకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఘాటు హెచ్చరిక జారీ చేశారు. ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్ భూభాగం నుంచి దాడులు చేయడాన్ని తాము అనుమతించేది లేదని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.

పుల్వామా ఉగ్ర దాడి అనంతరం భారతవాయుసేన పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిన నేపథ్యలో పాక్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఇండో -పాక్ దేశాల మధ్య కాల్పులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా అమెరికా, బ్రిటన్ తోపాటు పలు దేశాలు పాక్ ఉగ్ర దాడులను నివారించాలని ఒత్తిడి తీసుకువచ్చాయి. పాక్ లోని పలు ఉగ్రవాద సంస్థలు కశ్మీర్  లో భారత భద్రతా బలగాలపై తరచూ దాడులకు పాల్పడుతున్నాయి.

దీంతో పాక్ సర్కారు మిలిటెంట్లకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టింది. మిలిటెంట్లకు శిక్షణ ఇస్తున్న 182 పాఠశాలలను సీజ్ చేసి వాటిపై నిషేధం విధించింది. దీంతోపాటు పాక్ పోలీసులు 120 మంది మిలిటెంట్లను అదుపులోకి తీసుకున్నారు. పాక్ గతంలోనూ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఇలాంటి చర్యలు తీసుకున్నా ఉగ్ర దాడులు మాత్రం ఆగలేదు. శాంతి వచనాలు పలుకుతున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాక్ దేశంలో ఎలాంటి ఉగ్రవాద సంస్థల నిర్వహణను అనుమతించేది లేదని ప్రకటించారు.