జ‌గ‌న్‌పై జేసీ అనుచిత వ్యాఖ్యలకు వైసీపీ నేత పైలా స్ట్రాంగ్ కౌంటర్

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ దివాకర్ రెడ్డి తన కొడుకు పవన్ కు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారన్నారు. అందులో భాగంగానే సీఎం ని ప్రసన్నం చేసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏప ప్రతిపక్ష నేత జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అనంతపురం జిల్లా స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జేసీపై ఆయన మండి పడ్డారు.

చంద్రబాబు నాయుడు భజన బృందానికి జేసీ దివాకర్ రెడ్డి టీం లీడర్ గా వ్యవహరిస్తున్నారు అన్నారు. జగన్ పై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం మానుకోమని సూచించారు. టీడీపీ ఒక పెద్ద డ్రామా కంపెనీ అని, మీలాగా 20 ఏళ్ళ నుంచి సీఎంల పంచన చేరి డ్రామాలాడాల్సిన అవసరం వైసీపీకి లేదని తెలిపారు. టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తే అవినీతిలో మూడో స్థానంలో ఉన్న రాష్ట్రం మొదటి స్థానంలోకి వస్తుందని, రాష్ట్రం కరువుకాటకాలతో విలవిలలాడి వల్లకాదు అవుతుందని ఎద్దేవా చేశారు.

జగన్ ను మావాడు అని సంబోధించే జేసీ, ఆయనపై హత్యాయత్నం జరిగితే కనీసం పరామర్శించకపోవడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శలు చేశారు. జగన్ పై విమర్శలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న జేసీ తన నోటిని సూది చేసుకోవాలని హితవు పలికారు. వైస్ జగన్ అన్ని కులాల వారికీ సమన్యాయం చేస్తున్నారని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ స్థానాలు కల్పించి వారిని అసెంబ్లీకి పంపిన ఘనత జ‌గ‌న్‌దే అని గుర్తు చేశారు.

ఆయన మీలాగా తెలుగుదేశం పార్టీ పంచన చేరలేదు. సొంత పార్టీ స్థాపించి 65 మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను ఒంటి చేత్తో గెలిపించుకుని సత్తా చాటిన లీడర్ అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న జగన్ పై దిగజారుడు, చవకబారిన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు పైలా నరసింహయ్య.