ప్రముఖ బిజినెస్ మ్యాన్‌కి దర్శి టికెట్ ఫిక్స్ చేసిన జగన్

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం టికెట్ పై కొంతకాలంగా వైసీపీలో సందిగ్ధం నెలకొంది. గత ఎన్నికల్లో టీడీపీ నేత శిద్ధా రాఘవరావు చేతిలో ఓడిపోయారు వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. కుటుంబ పరిస్థితుల కారణంగా ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేయలేను అని జగన్ తో చెప్పడంతో బాదం మాధవరెడ్డిని దర్శి ఇంఛార్జిగా నియమించారు. అయితే మాధవరెడ్డికి, బూచేపల్లికి పొసగకపోవడంతో బాదం మాధవరెడ్డి పార్టీకి దూరం అయ్యారు అని టాక్. ఈ నేపథ్యంలో దర్శిలో బలమైన అభ్యర్థి కోసం వైసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

అయితే 2019 ఎన్నికల్లో మళ్ళీ బూచేపల్లిని దింపాలని సన్నాహాలు జరిగాయి. కాగా అందుకు బూచేపల్లి 3 నెలల గడువు కోరినట్టు తెలిసింది. అయితే అనూహ్యంగా జగన్ దర్శి టికెట్ ప్రముఖ వ్యాపారవేత్త మద్దిశెట్టి వేణుగోపాల్ కు ఖరారు చేసినట్టు సమాచారం. కాగా నెల రోజుల క్రితమే ఈ విషయంపై అధిష్టానం వేణుగోపాల్ తో చర్చలు జరుపగా ఆయన నెల రోజులు గడువు కోరారు. నెల రోజులు టైం తీసుకున్న వేణుగోపాల్ పార్టీలో చేరడానికి సిద్ధమేనని శుక్రవారం లోటస్ పాండ్ లో జగన్ తో కలిసి వివరించారు. జగన్ వెంటనే రంగంలోకి దిగి ఎన్నికలకు సిద్ధం అవ్వాలని చెప్పగా ఆయన సంక్రాంతి తర్వాత పార్టీలో చేరతానని కోరినట్లు తెలుస్తోంది.

మద్దిశెట్టి వేణుగోపాల్ 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ తన వ్యాపారాలను చూసుకుంటున్నారు. కాగా వైసీపీ అధిష్టానం ఆయన్ని దర్శి బరిలో పొట్టే చేయాలనీ కోరగా ఆయన కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సరైన సమయం అని భావించి అంగీకరించినట్లు తెలుస్తోంది. కాగా బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అందుకు మద్దతు ఇస్తారో లేదో చూడాలి. ఎందుకంటే గతంలో కూడా ఇంఛార్జిగా ఉన్న బాదం మాధవరెడ్డిని వ్యతిరేంకించారు.

కాగా మద్దిశెట్టి వేణుగోపాల్ కు దర్శి బాధ్యతలు అప్పగించడాన్ని వైసీపీ శ్రేణులు స్వాగతిస్తున్నారు. దర్శిలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ కూడా ఇప్పటికే ఆలస్యం అయిందని మరోసారి గడువు పెంచకుండా వీలైనంత త్వరగా బాధ్యతలు స్వీకరించమని వేణుగోపాల్ కు సూచించినట్టు సమాచారం. అందుకు వేణుగోపాల్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న దర్శి వైసీపీ అభ్యర్థి విషయంలో ఒక స్పష్టత వచ్చింది.