తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని ఫైర్ అయ్యారు. కెసిఆర్ ఇటీవలే అసభ్యపదజాలంతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. దీంతో టీఆరెస్, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా కేసీఆర్ కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాదినేని యామిని వీడియో ద్వారా కేసీఆర్ విమర్శలపై రీఅటాక్ చేశారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై, ఆంధ్ర ప్రజలపై తీవ్ర పదజాలంతో అసహ్యకరంగా విద్వేషాలను రెచ్చగొట్టేలా కేసీఆర్ తన అక్కసు వెళ్లగక్కుకున్నారు. ఆయన మాటలు చూస్తే నక్కకి చీకటి తెలియదు, గుడ్లగూబకు వెలుగు తెలియదు, అలానే కేసీఆర్ కి సోయ లేదు, స్పృహ లేదు. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఎవరినైనా, ఏదైనా మాట్లాడొచ్చు అని నోటికొచ్చినట్టు ఏపీ సీఎం ని టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు. ఆయన మాటలు చూస్తుంటే అది టీడీపీపైన ద్వేషంలా లేదు. మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణ కంటే లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీ అన్ని రంగాలలోను అభివృద్ధి చెందడం చూసి ఈ విధంగా అక్కసు వెళ్లగక్కుతున్నారు.
ఆయన అనంగ మిత్రుడు మోదీ రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతున్నా ఏపీ సీఎం అభివృద్ధిలో వెనుకడుగువేయకుండా ముందుకెళ్తున్నారు. థర్డ్ ఫ్రంట్ అంటూ హైర్డ్ డోర్ నుండి మోదీని కలిసి ఎంత ప్యాకేజ్ తెచుకున్నారో తెలియదు కానీ రాగానే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును టార్గెట్ చేశారు. నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ పట్టించుకోకపోయేసరికి కడుపుమంటతో ఈ విధంగా అక్కసు వెళ్ళగక్కారని మండిపడ్డారు యామిని.
ఏపీ ప్రత్యేకహోదాపై టీఆరెస్ ఊసరవెల్లి ధోరణి వహిస్తోందని ఆగ్రహించారు. మీ రాజకీయం ఎక్కడి నుండి మొదలయ్యింది. పొత్తు కోసం చంద్రబాబుతో కాళ్లబేరానికి వచ్చిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. సైబర్ టవర్స్ చంద్రబాబు కట్టలేదన్నారు. మీ పూర్వీకులు, మీ తాతముత్తాతలు వచ్చి కట్టారా? అని కేసీఆర్ ని నిలదీశారు యామిని. మా రాష్ట్ర ముఖ్యమంత్రి మా న్యాయవాదుల గురించి మాట్లాడితే మీకేంటి నొప్పి? మేము శ్వేతా పత్రాలు విడుదల చేస్తే మీకేంటి బాధ? శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము మీకు లేదు కనుకనే మాట్లాడుతున్నారా?
మా ముఖ్యమంత్రికి ఇంగ్లీష్ రాదని హేళన చేస్తారు. ఆయనకీ భాష వచ్చిన రాకపోయినా ఐటీ ని తీసుకొచ్చారు. మీకు భాష వచ్చి నాలుగున్నరేళ్లలో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు అని సూటిగా ప్రశ్నించారు యామిని. ఇంకా ఆమె ఏం మాట్లాడారో తెలియాలంటే కింద ఉన్న వీడియో చూడండి.