టీడీపీలో మంటపెడుతోన్న పవన్… మరో టిక్కెట్ కన్ ఫాం?

పవన్ వ్యవహార శైలి చూస్తుంటే… కొన్ని సందర్భాల్లో చంద్రబాబు లేకపోతే ఎలా రాజకీయంగా ఎలా బ్రతకగలను అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు.. ఒకసారి బీజేపీ పెద్దలతో మాట్లాడితే.. చంద్రబాబుకు తన అవసరం ఉంది కానీ, చంద్రబాబు అవసరం తనకు లేదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి చంద్రబాబు విషయంలో పవన్ అలానే ఆలోచించారు.

టీడీపీ – జనసేన రాబోయే రోజుల్లో కలిసే ఎన్నికలకు వెళ్తాయని.. ఆలాకానిపక్షంలో లోపాయకారీ ఒప్పందంతో నడుస్తాయని అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు – పవన్ లకు ఈ విషయంలో పూర్తి అవగాహన, అనుకూలతా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యలో పవన్ మాత్రం వన్ సైడ్ గా అభ్యర్థులను ప్రకటించేస్తున్నాడు.

ఇందులో భాగంగా ఇప్పటికే సీనియర్ టీడీపీ నేతలకు షాకిచ్చేలా కొన్ని కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు పవన్. తాజాగా గజపతి నగరం టికెట్ కూడా పవన్ కల్యాణ్ దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి పడాల అరుణ చేరిక సందర్భంగా పవన్, గజపతి నగరంలో జనసేన పోటీ చేస్తుందని తేల్చేశారు.

అవును… గజపతి నగరం జనసేన టికెట్ పడాల అరుణకు ఖాయమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఆ హామీతోనే ఆమె పార్టీలో చేరారని అంటున్నారు. అంటే అక్కడ టీడీపీ, బీజేపీకి అవకాశం లేదనే అనుకోవాలి. పైగా గతలో రెండు సారొలు టీడీపీ నుంచి పోటీచేశారు. దీంతో… టీడీపీలో టికెట్ రాదని తెలిసి బయటకు వచ్చి, ఇప్పుడు జనసేనలో చేరారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఒకవేళ టీడీపీ – జనసేన పొత్తు కన్ ఫాం అయితే ఈ నియోజకవర్గంలో రేపు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా అక్కడ అరుణకు మద్దతివ్వాల్సిన ఉంటుంది. ఇలాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. ఈ వ్యవహారమంతా టీడీపీ నాయకులకు మింగుడుపడటంలేదని చెబుతున్నారు.

ఇప్పటికే కొవ్వూరు నియోజకవర్గంలో కూడా ఇలానే టీడీపీ మాజీ నేతకు ఛాన్స్ ఇచ్చారు పవన్! దీంతో… ఇలా టీడీపీ నుంచి వెళ్లినవారందరికీ జనసేన ఆశ్రయమిస్తే, రేపు టికెట్ల వ్యవహారంలో తేడాలొస్తాయని అంటున్నారు. అయితే అధికారికంగా పొత్తు ఖరారు కాలేదు కాబట్టి ఎవరూ బయటపడటంలేదంతే!

కాగా… గజపతినగరం నుంచి పడాల అరుణ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989, 1994, 2004 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. 2009లో ఓడిపోయారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. అయితే పార్టీలో తనకు ప్రాధాన్యత లభించడం లేదంటూ రెండేళ్ల క్రితం ఆమె టీడీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు జనసేనలో చేరారు!