పవన్ వద్దకు చంద్రబాబు వెళితే ప్యాకేజీనా.? రామోజీ దగ్గరకి జగన్ వెళ్ళారుగా.!

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కదా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళింది.! టీడీపీకి మద్దతు కావాలని గతంలో కూడా చంద్రబాబే కదా పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళి అడిగింది.?

రాజకీయంగానో, మీడియా పరంగానో.. ఏ అవసరం వచ్చిందోగానీ, గతంలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు దగ్గరకు వెళ్ళింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కదా.? ఇక్కడ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకోవడమేంటి.? ఈ చర్చను ఇప్పుడు అనూహ్యంగా తెరపైకి తెస్తోంది జనసేన పార్టీ.!

రామోజీరావు అంటే రాజకీయంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ‘ప్రత్యర్థి’ లాంటి వ్యక్తి. టీడీపీకి రాజగురువుగా రామోజీరావుని చెబుతారు. ‘ఆ రెండు పత్రికలు..’ అంటూ ఈనాడుపైనా, ఆంధ్రజ్యోతిపైనా అప్పట్లో వైఎస్సార్ విరుచుకుపడేవారు. వాటికి అదనంగా మరికొన్ని మీడియా సంస్థల్ని కలిపి ‘దుష్ట చతుష్టయం’ అంటోంది వైసీపీ.

తమ అవసరాల నిమిత్తం రామోజీరావు వద్దకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళతారు.. మళ్ళీ అదే రామోజీరావుని రాజకీయంగా విమర్శించారు. ఇదేం కథ.? పైకి విమర్శలు లోలోపల లాలూచీలు.. అన్నది జనసేన విశ్లేషణ.!

‘టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై వైసీపీ దాడి చేస్తే.. మేం ఖండించాం. మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అప్పట్లో చంద్రబాబు దగ్గరకు వెళ్ళలేదు. విశాఖలో జరిగిన ఘటనలపై పవన్ కళ్యాణ్‌కి సంఘీభావం తెలపడానికి మాత్రం చంద్రబాబు వచ్చారు. ఇక్కడ అవసరం చంద్రబాబుది..’ అని జనసేన అంటోంది.

కొడాలి నాని, రోజా, అమర్నాథ్, అవంతి శ్రీనివాస్ తదితరులంతా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చినవాళ్ళే. వీళ్ళు మళ్ళీ టీడీపీలోకి వెళతారేమో.! అలా వెళ్ళేందుకు, వచ్చేందుకు వీలుగా రెండు పార్టీల మధ్యా ప్యాకేజీ వ్యవహారాలు నడుస్తున్నాయేమోని జనసేన ఆక్షేపిస్తోంది.