జనసేనకి రెండు సీట్లేనా.? ఇదేం లొల్లి.?

టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విషయమై రకరకాల ప్రచారాలున్నాయ్.. పొలిటికల్ మీడియా సర్కిల్స్‌లో. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, తెలుగు మీడియాలో టీడీపీ అను‘కుల’ మీడియా డామినేషన్ ఎక్కువ. వాటి విశ్వసనీయత ఎంత.? అన్నది వేరే చర్చ.

జనసేనకు కేటాయించే సీట్లు (లోక్ సభ)కి సంబంధించి సగానికి పైగా సీట్లలో పోటీ చేసే అభ్యర్థులు ఖాయమయ్యారంటూ ఓ లిస్ట్ అనధికారికంగా బయటకు వచ్చింది. అందులో జనసేనకు టీడీపీ కేటాయించిన సీట్లు కేవలం రెండు మాత్రమే. ఆ లెక్కన, మిగతా లిస్టులో ఒకే ఒక్కటి వుండొచ్చు జనసేనకి.

అంటే, రెండుతో సరిపెడతారో, ఆ ఇంకోటి జాయిన్ చేసి మూడు సీట్లు జనసేనకు టీడీపీ నుంచి కేటాయిస్తారో తెలియదన్నమాట.! ఇది టీడీపీ అను‘కుల’ మీడియా తెచ్చిన లిస్టు. అయితే, ఈ లిస్టుని టీడీపీ శ్రేణులే విశ్వసించడంలేదు.

కాకపోతే, ఇలాంటి ఫేక్ ప్రచారాలకు ఎక్కువ ప్రాచుర్యం కల్పిస్తే, టీడీపీ మీద జనసేన నుంచి ఒత్తిడి తగ్గుతుందని బహుశా కొందరు తెలుగు తమ్ముళ్ళు భావించొచ్చేమో. కానీ, జనసేన శ్రేణులైతే ఈ లిస్టుని తిట్టిపోస్తున్నాయి.

‘చెరిసగం సీట్లు ఇస్తే తప్ప జనసేన – టీడీపీ మధ్య ఓటు ట్రాన్స్‌ఫర్ సజావుగా సాగదు’ అని జనసేన శ్రేణులు తెగేసి చెబుతున్నాయి. జనసేన నేతలు కొందరు బాహాటంగానే, ‘చావు బతుకుల్లో వున్న టీడీపీకి ఊపిరి పోసింది జనసేన..’ అని వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే.

ఏమో, చంద్రబాబు రాజకీయాలు ఎలా వుంటాయో ఇప్పుడే ఊహించలేం. ఎంపీ సీట్లే రెండు మూడు అంటే, అసెంబ్లీ సీట్లు 15 నుంచి 25 వరకు ఇవ్వడం కనా కష్టమే.! అదే జరిగితే, జనసేన పార్టీ నుంచి కౌంటర్ ఎటాక్ ఎలా వుంటుందో ఏమో.!