ఏడాది మాత్రమే మిగిలి వుంది.! వైఎస్ జగన్ జర జాగ్రత్త.!

చుట్టూ భజనపరులు చాలామందే వుంటారు. లోపాల్ని స్పష్టంగా ఎత్తి చూపేవాళ్ళే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు కావాల్సింది.! ఔను, నాలుగేళ్ళ భజన ఓ యెత్తు.. ఏడాది జాగ్రత్త ఇంకో యెత్తు.!

నాలుగేళ్ళ పాలనకు సంబంధించి ‘గొప్పల’ గురించి మాట్లాడుకోవడం కంటే, వైఫల్యాల గురించిన చర్చ పార్టీలో అంతర్గతంగా జరగాలి. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సమస్యలపై నిక్కచ్చిగా చర్చ జరిగితేనే, ‘వైనాట్ 175’ అనే మాట దిశగా సరైన అడుగులు పడతాయ్.

కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన చుట్టూ వున్న భజన పరుల్ని ప్రోత్సహిస్తున్నారు తప్ప, పొంచి వున్న ప్రమాదాన్ని గురించి హెచ్చరించేవాళ్ళ మాటల్ని అస్సలు పట్టించుకునే పరిస్థితి లేదు. గడప గడపకీ మన ప్రభుత్వం అన్నారు.. నువ్వే మా నమ్మకం జగనన్న కార్యక్రమం అన్నారు.. వీటి ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్ విషయమై ఆత్మవిమర్శ జరిగిందా.? డౌటే.!

మిస్‌డ్ కాల్స్ ద్వారా రాష్ట్రంలో 90 శాతానికి పైగా ప్రజల మద్దతును పొందగలిగామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ, అది వాస్తవం కాదు. చాలా సర్వేల్లో వైసీపీకి ముందు ముందు గడ్డు కాలమేనని తేలుతోంది. భారీగా సీట్లను వైసీపీ కోల్పోతుందని సర్వేలు హెచ్చరిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం.

అయినాగానీ, ‘వై నాట్ 175’ అనే మాటకే కట్టుబడి వుంది వైసీపీ. నాలుగేళ్ళు పూర్తయిపోయాయ్.. మిగిలింది ఏడాది మాత్రమే. ప్రతి రోజూ ముఖ్యమే ఇక్కడ.! డ్యామేజ్ కంట్రోల్ చర్యలు వీలైనంత త్వరగా చేపట్టి తీరాల్సిందే.