‘రాజు మారిన ప్రతిసారీ రాజధాని మారిపోతుందంటే ఎలా.? అమరావతి, విశాఖపట్నం, కర్నూలు.. ఏదైనా ఒక్కటే రాజధాని వుండాలి. ఒక్కసారే రాజధానిపై నిర్ణయం జరిగిపోవాలి, జరిగిపోయింది కూడా.! అప్పట్లో అమరావతి రాజధానికి మద్దతిచ్చిన మీరు, ఇప్పుడెందుకు మూడు రాజధానులంటున్నారు.? అమరావతి అయినా, విశాఖ అయినా, కర్నూలు అయినా.. నాకేమీ పెద్దగా తేడా లేదు..’ అని జనసేనాని తేల్చి చెప్పారు రాజధాని విషయంలో.
నిజమే, దేశంలో ఏ రాష్ట్రానికీ రెండు రాజధానులు లేవు. జమ్మూకాశ్మీర్‌కి తప్ప. అక్కడ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రెండు రాజధానులున్నాయి. దేశంలో ఎక్కడా ఒకటికి మించి రాజధానులు ఏ రాస్ట్రానికీ లేనప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఎందుకు.? ఈ ప్రశ్నకు సరైన సమాధానం అయితే అధికార వైసీపీ చెప్పలేకపోతోంది.
మూడు రాజధానుల ఆటతో, రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ దెబ్బ తీస్తోందన్నది నిర్వివాదాంశం. రాజధాని లేని రాష్ట్రం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. మొండి పట్టుదలతో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్న అపప్రదధను ఎందుకు వైసీపీ మోయాలి.? ఈ విషయమై వైసీపీలో ఎందుకు ఆత్మ విమర్శ జరగడంలేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
వైసీపీ చెబుతున్న మూడు రాజధానుల నినాదానికి వచ్చే ఎన్నికల్లో మద్దతు లభిస్తే, ఆ తర్వాత ఐదు రాజధానులనో, పది రాజధానులనో డిమాండ్ తెరపైకొస్తుంది. అప్పుడూ జనం మద్దతిస్తే ఏంటి పరిస్థితి.? రోడ్లు బాగు చేయమని ప్రజలు అడుగుతోంటే, అవి బాగు చేయని వైసీపీ.. ఉత్తరాంధ్ర ప్రజలు రాజధాని అడుగుతున్నారని చెప్పడంలో అర్థమేముంది.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది.
అమరావతిలో భూ కుంభకోణం జరిగితే, దోషుల సంగతి తేల్చాలి. కానీ, అది జరిగే పని కాదు. ఆ విషయం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ బాగా తెలుసు. తనపై వున్న అక్రమాస్తుల కేసు విచారణ ఎలా సాగదీయబడుతున్నదీ ఆయనకే తెలుసు గనుక, అమరావతి భూ కుంభకోణంలో ఆరోపణల తాలూకు పస ఎంత.? అన్నది ఆయనకి తెలియకుండా వుంటుందా.?
ఏదిఏమైనా, బేషజాలకు పోవాల్సిన అవసరం లేదు. మద్య నిషేధం విషయంలో.. సీపీఎస్ రద్దు విషయంలో మాట తప్పి, మడమ తిప్పినట్లే అనుకుని.. రాజధాని విషయంలో వెనక్కి తగ్గడం వైసీపీ, రాష్ట్రానికీ మంచిది.