ఏమైంది జనవాణి.? ఏమైపోయింది కౌలు రైతు భరోజా యాత్ర.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించడం, ఆ తర్వాత ఆయన అనారోగ్యం బారిన పడటం తెలిసిన విషయమే. వైరల్ జ్వారలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా, ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, భద్రతా సిబ్బంది అనారోగ్యం బారిన పడటంపై జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
జనసేనాని అనారోగ్యం బారిన పడిన దరిమిలా, జనవాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు. కానీ, మళ్ళీ ఎప్పుడు ఆ కార్యక్రమం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇంకో వైపు, జనసేన కౌలు భరోసా యాత్ర విషయమ్మీద కూడా స్పష్టత లేదు. అనూహ్యంగా రాజకీయ తెర నుంచి పవన్ కళ్యాణ్ గాయబ్ అవడంతో సహజంగానే రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు దూసుకొస్తాయ్.
ఆ విమర్శల్ని జనసేన పార్టీ తట్టుకోలేకపోతోంది. అధికార పార్టీ నుంచి వస్తున్న ప్రశ్నలకు, అడ్డగోలు సమాధానాలు చెబతున్నారు జనసేన నేతలు. అంతే తప్ప, జనవాణి మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది.? జనసేన కౌలు రైతు భరోసా యాత్ర సంగతేంటి.? అన్న ప్రశ్నలకు మాత్రం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.
జనసేనాని ప్రత్యక్షంగా రాజకీయాల్లో కనిపించకపోతేనేం.? ఆయన ట్విట్టర్ మాత్రం సందడి చేస్తూనే వుంది. మద్యపాన నిషేధానికి సంబంధించి అధికార వైసీపీ జనసేన పార్టీ సెటైర్లు వేస్తోంది. ఈ మేరకు జనసేన అధినేత నుంచి ట్వీట్లు.. అందులో కార్టూన్లు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మద్యపాన నిషేధం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యూ టర్న్ తీసుకున్నారు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, ఈ విషయమై నిలదీయడానికి కార్టూన్లు సరిపోవు కదా.? జనసేన అధినేత స్వయంగా రంగంలోకి దిగి, మద్యపాన నిషేధంపై పోరాటం చేయాలి. కానీ, పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఈ విషయమై కనీసం వీడియో బైట్ కూడా ఇవ్వలేకపోయారు.
పోనీ, జనసేన ముఖ్య నేతలేమైనా రోడ్డక్కి ఆందోళనలు చేస్తున్నారా.? అంటే అదీ లేదు. ఏంటో ఈ జనసేన రాజకీయం.. వీకెండ్ పాలిటిక్స్ కాస్తా, మంత్లీ వన్స్ పాలిటిక్స్ అన్నట్లు తయారైంది.