వైసిపిలో చేరికలకు విరామం

తెలుగుదేశంపార్టీలో నుండి  చేరే నేతలతో మంచి ఊపుమీదున్న వైసిపికి కాస్త విరామం దొరికింది. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళటంతో  చేరికలకు  వారంరోజుల విరామం లభించినట్లైంది. లండన్ లో చదువుకుంటున్న కూతురును చూసేందుకు జగన్ తన కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం అర్ధరాత్రి బయలుదేరి వెళ్ళారు. దాదాపు 15 రోజులుగా టిడిపిలో నుండి పలువురు ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేసి వైసిపిలో చేరుతున్నారు.

ఎంఎల్ఏలు మేడా మల్లికార్జునరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, ఎంపిలు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్రలు టిడిపి సభ్యత్వంతో పాటు పదవులకు కూడా రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. సీనియర్ నేత దాసరి జై రమేష్, కాంగ్రెస్ నుండి  కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి లాంటి వారు వైసిపిలో చేరారు. టిడిపికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు వైసిపి కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

నరసాపురం బిజెపి ఎంపి గోకరాజు గంగరాజు కొడుకు గోకరాజు రంగరాజు కూడా వైసిపిలో చేరటానికి రంగం సిద్ధమైందని సమాచారం. రేపో మాపో టిడిపి కాకినాడ ఎంపి తోట నర్సింహం కూడా పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని చంద్రబాబుకు మద్దతిచ్చే మీడియానే చెబుతోంది. అలాగే గుంటూరు వెస్ట్ ఎంఎల్ఏ మోదుగుల వేణుగోపాలరెడ్డి రాజీనామా చేయబోతున్నారట. రాజీనామా చేసి వైసిపిలో చేరారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం కన్ఫర్మ్ కాలేదు. జగన్ లండన్ నుండి తిరిగి వచ్చేంత వరకూ వైసిపిలోకి రావాలనుకున్న నేతలందరికీ వారం పాటు విరామం లభించినట్లే.