వన్ నేషన్ వన్ రేషన్.. అంటోన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల విషయంలోనూ ఒకేలా ఎందుకు వ్యవహరించడంలేదంటూ పార్లమెంటు సాక్షిగా తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు సంధించిన ప్రశ్న, వ్యక్తం చేసిన ఆవేదన.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ‘వన్ నేషన్ వన్ జస్టిస్’ నినాదం భారతీయ జనతా పార్టీకి సంకటంలా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
దేశంలోని కొన్ని రాష్ట్రాలకు ఇంకా ప్రత్యేక హోదా కొనసాగుతూనే వుంది.. దురదృష్టవశాత్తూ పార్లమెంటు ద్వారా ఆంధ్రపదేశ్‌కి దక్కిన ప్రత్యేక హోదా అనే హక్కుని నరేంద్ర మోడీ సర్కార్ నిర్వీర్యం చేసింది. దేశంలో చాలా రైల్వే జోన్లున్నాయి.. రాష్ట్రానికి రైల్వే జోన్ ప్రకటితమయినా.. అది అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. దేశంలో రాజధాని లేని రాష్ట్రమంటూ ఏదన్నా వుంటే అది ఆంధ్రపదేశ్ మాత్రమే. కొన్ని రాష్ట్రాల మీద కేంద్రం గొప్ప ప్రేమ చూపుతూ, ఆంధ్రపదేశ్ మీద సవతి ప్రేమ ప్రదర్శిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు అదనపు హంగులు అద్దుతున్న కేంద్రం, ఆంధ్రపదేశ్‌లో మెట్రో ప్రాజెక్టులకు సహకరించడంలేదు. చెప్పుకుంటూ పోతే, ఒకటా రెండా.? చాలా విషయాల్లో రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోంది. నిజానికి, దేశంలో చాలా రాష్ట్రాల్లో ‘విభజన డిమాండ్లు’ వున్నాయి.
బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర్రపదేశ్‌లో కూడా విభజన డిమాండ్లున్నాయి. కానీ, కేవలం ఉమ్మడి తెలుగు రాష్ట్రంపైనే కేంద్రానికి ప్రత్యేక శ్రద్ధ కలిగింది (కాంగ్రెస్, బీజేపీ కలిసి విడదీశాయి). ఎందుకిలా.? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయమై కేంద్రాన్ని ‘వన్ నేషన్ వన్ జస్టిస్’ అని రామ్మోహన్ నాయుడు కేంద్రాన్ని నిలదీసినా.. నిజానికి నిలదీయాల్సింది చాలా అంశాల మీద. దేశంలోని రాష్ట్రాలన్నీ ఇప్పుడు ఈ విషయమై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సందర్భమిది.