కొడాలి నాని సీటు కన్ఫామ్ అయిపోయినట్లే.!

రాష్ట్రానికి ఒకరే సీఎం.. గుడివాడకు ఒకరే ఎమ్మెల్యే.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. గుడివాడకు ఎమ్మెల్యే కొడాలి నాని.. ఇది ఫిక్స్.. అంటున్నారు గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని.

‘నన్ను మాజీ మంత్రి అనొద్దు..’ అంటూ మంత్రి పదవి పోయాక ఒకింత మీడియా మీద గుస్సా అయిన కొడాలి నాని, మంత్రి పదవి లేకపోయినా, వైసీపీలో ఆ స్థాయి గౌరవాన్ని అయితే పొందుతున్నారు. బహుశా సామాజిక వర్గ సమీకరణమే అందుకు కారణం కావొచ్చు కూడా.

అబ్బే, ఇవేవీ కాదు.. కొడాలి నానిని గనుక కాదనుకుంటే, వల్లభనేని వంశీ వికెట్ కూడా పడిపోతుందనీ, సొంత పార్టీపైనే బూతులతో విరుచుకుపడతారని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కొడాలి నాని విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్న వాదనా లేకపోలేదు.

గుడివాడలో టిడ్కో ఇళ్ళ పంపిణీ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి సమక్షంలోనే, ‘రాష్ట్రానికి సీఎం ఒక్కడే.. గుడివాడకి ఎమ్మెల్యే కొడాలి నాని ఒక్కడే..’ అని ప్రకటించేసుకున్నారు. అంటే, వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి వైసీపీ తరఫున కొడాలి నాని మాత్రమే పోటీ చేస్తారన్నమాట.

సిట్టింగ్ ఎమ్మెల్యే మార్పు విషయమై వైసీపీ వర్గాల్లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి. కొడాలి నాని ఈసారి ఓడిపోవడం ఖాయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పార్టీ ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ కూడా అందిందట.

ఈ నేపథ్యంలోనే కొడాలి నాని ఛాన్స్ తీసుకున్నారు. తానే మళ్ళీ పోటీ చేస్తాననే సంకేతాలు ముఖ్యమంత్రి సాక్షిగా ఇచ్చేశారు.