మార్గదర్శి అక్రమాలు, అవినీతిపై సీఐడీ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థ కార్యాలయాల్లో దాడులు చేయడం, రామోజీరావుని విచారించడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో తాజాగా మార్గదర్శి అక్రమాలు, అవినీతిపై విచారణకు రావాలని ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్ కు సీఐడీ నోటీసులు జారీ చేసింది.
అవును… మార్గదర్శి కుంభకోణంలో ఏ1, ఏ2 లుగా ఉన్న రామోజీ, శైలజ లకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా… విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రామోజీని 16వ తేదీన ఉదయం 10:30 గంటలకు హాజరవ్వాలని సీఐడీ చెప్పింది. అలాగే 17వతేదీన విచారణకు హాజరవ్వాలని శైలజకు నోటీసులో స్పష్టంగా పేర్కొంది.
ఇక మార్గదర్శి వ్యాపారమంతా అవినీతి, అక్రమాలతోనే జరుగుతోందని సీఐడీ ఉన్నతాధికారులు ఇప్పటికే చాలాసార్లు మీడియా సమావేశంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. మార్గదర్శి వ్యాపారం ఏ విధంగా అక్రమమో కూడా అధికారులు వివరించారు. అసలు మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యాపారాన్ని ఏ చట్టం ప్రకారం నిర్వహిస్తున్నారో చెప్పాలని కోరారు. అయితే అందరినీ తన పత్రికలో ప్రశ్నించే రామోజీ మాత్రం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటంలేదు.
మార్గదర్శిలో అక్రమాలపై సీఐడీ అధికారులు, ఉండవల్లి వంటి పెద్దలు స్పందించిన సమయంలో మాత్రం… 60 ఏళ్ళుగా మార్గదర్శిపై ఎక్కడా ఫిర్యాదులు లేవని, విశ్వసనీయతకు మార్గదర్శి మారుపేరని మాత్రమే రామోజీ చెప్పుకుంటున్నారే తప్ప… ఆయన చేస్తోన్న వ్యాపారం అక్రమమో సక్రమమో మాత్రం చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు.
ఆఖరికి… చిట్ ఫండ్ నిధులను చిట్టేతర వ్యాపారాలకు తరలించకూడదన్న ప్రాథమిక నిబంధనను కూడా రామోజీ, శైలజ పాటించలేదని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. సుమారు 60 కంపెనీలకు చెందిన మ్యూచువల్ ఫండ్స్ లో చిట్ ఫండ్స్ డబ్బులను తరలించినట్లు రుజువైందని అంటున్నారు.
ఈ విషయంలో తన మీడియాలో మాత్రం ఏ ప్రశ్న అడిగినా రామోజీ చెప్పే ఆవుకథ ఒకటే.! 60 ఏళ్ళుగా మార్గదర్శిపై ఎక్కడా ఫిర్యాదులు లేవని మాత్రమే. మరోపక్క మార్గదర్శి చందాదారుల వివరాలను ప్రకటించమని కోర్టు ఆదేశించినా కూడా రామోజీ ప్రకటించటంలేదు. ఈ విషయంపై స్పందించిన ఉండవల్లి… ఈ దేశంలో చట్టం అందరికీ ఒకేలా లేదని బల్లగుద్ది చెబుతున్నారు. భారతీయ న్యాయవ్యవస్థని పరోక్షంగా ఎద్దేవా చేస్తున్నారు!
కాగా… గతంలో కూడా గుంటూరు ఆఫీస్ లో విచారణకు హాజరుకావాలని సీఐడీ నోటీసులిచ్చినా రామోజీ, శైలజ పట్టించుకోని సంగతి తెలిసిందే. సీఐడీ కార్యాలయానికి రమ్మంటే రావటంలేదు.. పోనీలే ముసలాయన కదాని ఇంటికి వెళ్ళి విచారిస్తే సహకరించటంలేదు. దీంతో… ఈసారి గనుక విచారణకు హాజరుకాకపోతే అరెస్టు చేస్తారనే ప్రచారం మొదలైంది.