ఎన్నికల కమీషన్ కోరల్లు లేని పాములాగ తయారైపోయింది. నిబంధనలు ఎన్ని ఉన్నా, ఎన్నికల కమీషనర్లు ఎన్ని హెచ్చరికలు చేస్తున్న ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. ఎన్నికలు నిర్వహించటం మాత్రమే కమీషన్ బాధ్యత మిగిలిన వన్నీ కమీషన్ కు అనవసరం అన్నట్లుగా ఉంది పార్టీల పరిస్ధితి. అధికారంలో ఉన్న పార్టీలైతే మరీ బరితెగించిపోతున్నాయి.
ప్రస్తుత విషయానికి వస్తే విశాఖపట్నం జిల్లాలోని గాజువాకలో తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి వాసుపల్లి గణేష్ కుమార్ రోడ్లపైనే బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంచేస్తున్నారు. అందరి ముందు ఓటర్లకు అభ్యర్ధే డబ్బులు పంచుతున్న ఎన్నికల కమీషన్ కు మాత్రం కనబడటం లేదు. పోనీ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారా అంటే అదీ లేదు.
నిజానికి వాసుపల్లి డబ్బులు పంచుతున్న విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ గా మారింది. చర్యలు తీసుకునేంత ధైర్యమే ఉంటే, చిత్తశుద్ది ఉంటే సోషల్ మీడియాలోని ఫోటోలను, వీడియోలనే సూమోటోగా తీసుకోవచ్చు. ఒక అభ్యర్ధిపై అనర్హత వేటు వేస్తే మిగిలిన అందరూ దారిలోకి వస్తారు. ఐదేళ్ళ కాలంలో ఎన్నికల కమీషన్ ఉనికిని చాటుకునేందుకు అవకాశం ఉండేదే ఈ రెండు నెలలు. అదికూడా వెన్నెముక లేని ఉన్నతాధికారుల వల్ల ఉపయోగం లేకుండా పోతోంది.