పవన్ కళ్యాణ్ లోక్ సభకి పోటీ.! కారణం అదేనా.?

అసెంబ్లీకి కాకుండా పవన్ కళ్యాణ్ లోక్ సభకు పోటీ చేయబోతున్నారా.? ఈ విషయమై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ సమాచారమిచ్చారా.? బీజేపీ పెద్దల ఆశీస్సులతోనే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారా.?

నిప్పు లేకుండా పొగ పుడుతుందా.? అంటే, రాజకీయాల్లో తేలిగ్గానే పుట్టేస్తుంది. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అత్యంత దారుణమైన ఓటమి అది. జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ మాత్రం రాజోలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇది మరింత అవమానకరమైన ఓటమి పవన్ కళ్యాణ్‌కి.

అందుకే, 2024 ఎన్నికల్లో ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఎలాగైనా గెలవాలన్న కసితో పవన్ కళ్యాణ్ వున్నారు. అయితే, జనసేన పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే, పవర్ షేరింగ్ ఊసే వుండదు.

ఈ నేపథ్యంలోనే, బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్‌కి లోక్ సభ సలహా ఇచ్చారట. ఇది ఇప్పటి మాట కాదు. ఇంకా టీడీపీతో పొత్తు చర్చలు షురూ అవకముందు వ్యవహారం.. అని అంటున్నారు. ఆ సూచనని పవన్ కళ్యాణ్ ఇప్పుడు అమలు చేయడానికి సానుకూలంగా వున్నారట.

తిరుపతి లేదా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒకదాంట్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం వుందంటున్నారు. తిరుపతిలో పోటీ చేస్తే, విశాఖ ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా.? గాజువాక అసెంబ్లీకి పోటీ చేస్తే, ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదో ఒక చోట నుంచి లోక్ సభకు పవన్ పోటీ చేస్తారా.? ఈ విషయాలపై ఇంకాస్త క్లారిటీ రావాల్సి వుంది.

అయితే, లోక్ సభకు పోటీ చేస్తే పార్టీకి నష్టమే తప్ప లాభం లేదన్న వాదన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోందిట. చూచాయి ఆలోచనే తప్ప, నిర్ణయం ఇంకా జరగలేదనేది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.!