జనసేనాని ఈసారైనా చట్ట సభలకు వెళతారా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ (గాజువాక, భీమవరం) ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో ఏం జరగబోతోంది.? ఎక్కడి నుంచి జనసేనాని పోటీ చేయబోతున్నారు.?

జనసేన శ్రేణుల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం అయితే, వచ్చే ఎన్నికల్లో జనసేనాని గాజువాక, భీమవరం.. ఈ రెండూ కాకుండా, వేరే నియోజకవర్గాన్ని ఎంచుకోవచ్చని తెలుస్తోంది. అయితే, గాజువాక లేదా భీమవరం.. ఈ రెండిటిలో ఏదో ఒక నియోజకవర్గాన్ని జనసేనాని ఎంచుకుంటే మంచిదన్న అభిప్రాయమూ కొందరిలో వ్యక్తమవుతోంది.

అందునా, ఈసారి గాజువాక నుంచి జనసేనాని గెలుపు నల్లేరు మీద నడకేనంటూ అక్కడి జనసేన శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. భీమవరంలోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పిఠాపురం, తిరుపతి తదితర నియోజకవర్గాల గురించి కూడా జనసేన పార్టీలో చర్చ జరుగుతోంది పవన్ కళ్యాణ్ పోటీ విషయమై.

ఎక్కడి నుంచి జనసేనాని పోటీ చేసినా, ఆయన్ని ఓడించి తీరతామని అధికార వైసీపీ అంటోంది. అనడమే కాదు, అందుకు తగ్గ ప్రణాళికలూ సిద్ధం చేసుకుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంపై స్పష్టత రాగానే, ’ప్లాన్-బి‘ అమలు చేయడానికి వైసీపీ సిద్ధంగానే వుంది.

నిజానికి, జనసేనాని పవన్ కళ్యాణ్, చట్ట సభలకు వెళ్ళడం అనేది పెద్ద కష్టమేమీ కాదు. 2009 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచే ఆయన ఆ ప్రయత్నం చేసి వుండాల్సింది. కానీ, చేయలేదు. 2014 ఎన్నికల్లో జనసేనాని పోటీ చేసి వుంటే, ఖచ్చితంగా ఆయన గెలిచి వుండేవారే. ఆ వేవ్ అలాంటిది. 2019 ఎన్నికల్లో కూడా, ఒకే నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకుని వుంటే, గెలిచే అవకాశం వుండేది.

చట్ట సభలకి వెళ్ళడమంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరమే లేదు. ఎమ్మెల్సీగా ఛాన్స్ దక్కించుకోవచ్చు, రాజ్యసభకు ఎంపికవ్వొచ్చు. ఇవి రెండూ, ఖర్చు లేదా పరపతి ఉపయోగిస్తే దక్కే పదవులు. కానీ, జనసేనాని అటువైపు చూడలేదు.