విశాఖపట్నం చుట్టూ రాష్ట్ర రాజకీయాలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. విశాఖకు కేంద్రం ఇవ్వాల్సిన రైల్వే జోన్ గురించి ఎవరూ మాట్లాడటంలేదుగానీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలూ ఒక్క తాటిపైకి వచ్చేసి.. పోరాటం చేసేస్తాన్నంటున్నాయి. అలాగని ఆయా పార్టీల మధ్య రాజకీయ విభేదాల్లేవా.? అంటే, ఒక్కతాటిపైకి వస్తాం.. అంటూనే ఒకరి మీద ఇంకొకరు బురద చల్లుకుంటున్నారు. ఇదిలా వుంటే, తాజాగా విశాఖలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు, విశాఖపట్నం ఆర్థిక రాజధాని.. అంటూ సంచలన ప్రకటన చేశారు.
నిజమే, విశాఖపట్నం రాష్ట్రానికి ఆర్థిక రాజధాని. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి ప్రత్యేకత వున్న నగరం విశాఖ మాత్రమే. కానీ, ఏం లాభం.? విశాఖ మీద అందరూ సవతి ప్రేమ చూపించారు. ఉమ్మడి ఆంద్రపదేశ్‌కి ముఖ్యమంత్రులుగా పనిచేసినవారందర్నీ ఈ లిస్టులోనే వెయ్యాలి. ప్రస్తుత జగన్ సర్కార్, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిందిగానీ.. విశాఖ అభివృద్ధి కోసం ఎలాంటి ప్రత్యేకమైన చర్యలనీ గడచిన రెండేళ్ళలో చేపట్టలేదు. ప్రస్తుతం ఎగ్జక్యూటివ్ క్యాపిటల్ అంశం కోర్టు పరిధిలో వుంది. ఈ అంశంపై స్టేటస్ కో అమల్లో వున్న విషయం విదితమే. సరిగ్గా ఈ తరుణంలో విశాఖను ఆర్థిక రాజధానిగా చంద్రబాబు అభివర్ణించడం, అందునా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడంతో రాజకీయంగా ఇదొక ఆసక్తకిరమైన చర్చకు కారణమయ్యింది.
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే ప్రస్తావన వచ్చి ఏడాది పూర్తయిపోయింది. ఈ ఏడాదిలో విశాఖలో ఎలాంటి కొత్త అభివృద్ధి కూడా జరగలేదు. ఇంకోపక్క విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్ని దృష్టిలో పెట్టకునే చంద్రబాబు అత్యంత వ్యూహాత్మకంగా విశాఖను ఆర్థిక రాజధాని అనేశారు. చంద్రబాబు అనేశారో, జగన్ ప్రకటించేశారనో.. విశాఖ వాసుల ఆలోచనలు మారిపోతాయా.? అంటే, ప్రత్యేక హోదా సహా రైల్వేజోన్, విశాఖ స్టీల్ ప్లాంట్.. ఇలా చాలా అంశాలు ఎన్నికల సందర్భంగా చర్చకు వచ్చి తీరతాయి.