25 కాదు, 26.! రాష్ట్రంలో జిల్లాలెన్నో తెలియదా పవన్ కళ్యాణ్.?

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 13. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య 26కి పెరిగింది. వైఎస్ జగన్ హయాంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మొత్తంగా జిల్లాల సంఖ్య 26 అయ్యింది. కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు వున్నాయో తెలియని అయోమయం కలిగినట్టుంది.

25 జిల్లాలు, ఇరవై ఐదు రాజధానులు.. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రా.. అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా వేసిన ట్వీట్ మీద వైసీపీ శ్రేణులు ఘాటుగా స్పందిస్తున్నాయి. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలకీ ఒకే ఒక్క రాజధాని వుంది. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం మూడు రాజధానులు అవసరమని అధికార వైసీపీ అంటోంది.

సరే, వైసీపీ ఆలోచనతో జనసేన విభేదించొచ్చు. దాన్ని తప్పు పట్టలేం. ముందైతే ఓ రాజధాని వుంటే, ఆ తర్వాత మరో రెండు రాజధానులు నిర్మించుకోవచ్చు. కానీ, వున్న ఆ ఒక్క రాజధానినీ స్మశానమని ఆరోపిస్తూ, అధికార వైసీపీ ఇంకో రెండు రాజధానుల గురించి ఆలోచిస్తోంది. ఇక్కడ వైసీపీ తీరు సైతం ఆక్షేపణీయం.

అమరావతి నుంచే అధికారిక కార్యకలాపాలు సాగుతున్నాయి. అమరావతి పరిధిలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత ఇల్లు కూడా వుంది. కానీ, ఆ ప్రాంతాన్ని మంత్రులే స్మశానంగా, ఎడారిగా, ముంపు ప్రాంతంగా అభివర్ణిస్తున్నారు. అదంతా రాజకీయం.!

ఈ రాజకీయమే రాష్ట్రానికి శాపంగా మారుతోంది. అధినేత మెప్పు కోసం అధికార పార్టీ నాయకులు మూడు రాజధానుల పేరుతో, అమరావతి మీద విషం చిమ్మడం ముమ్మాటికీ ఘోర తప్పిదమే. వారిని ముఖ్యమంత్రి ఎందుకు ప్రోత్సహిస్తున్నారన్నది వేరే చర్చ.

కానీ, రాష్ట్రంలో ఎన్ని జిల్లాలో తెలియకుండా, రాష్ట్రంలో రాజకీయం చేసేసి.. అధికార పీఠమెక్కేయాలనుకుంటున్నారు జనసేనాని. ఇది కదా, భావదారిద్ర్యమంటే.. అంటూ వస్తున్న విమర్శలకు జనసేన అధినేత ఏం సమాధానం చెబుతారో ఏమో.!