జగన్ కోరిక నాగాలాండ్ లో నెరవేరింది!

2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్లతో ఘనవిజయం సాధించడం.. అనంతరం పాలన అద్భుతంగా చేస్తున్నామని నమ్మడం.. ప్రతీ కుటుంబానికీ ప్రభుత్వ పథకాలు అందిస్తుండటం.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకురావడం.. గ్రామ సచివాలయాలతో పాలనను గ్రామాలకు చేరువచేయడం.. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ అందించడం.. 90%పైగా హామీలను అమలుచేయడం వంటి వాటితో ఇక తనకు అడ్డులేదని భావిస్తున్నారు జగన్. అందులో భాగంగా ఈసారి టార్గెట్ 175 అంటున్నారు. అంటే… ప్రతిపక్షం లేని ప్రభుత్వం అన్నమాట! అయితే… జగన్ కోరిక తాజాగా నాగాలాండ్ లో జరిగింది!

తాజాగా ఊహించని రీతిలో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు సక్సెస్ అవ్వడంతో 175 కి 175 వచ్చేస్తాయని… ఫలితంగా ప్రతిపక్షం లేని ప్రభుత్వమే తన లక్ష్యమని చెప్పకనే చెబుతున్నారు జగన్! అయితే 100% సీట్లు గెలవకుండానే ప్రతిపక్షం లేని ప్రభుత్వం ఏర్పాటైంది నాగాలాండ్ లో! అవును… తాజాగా జరిగిన ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో నాగాలాండ్ లోని 60 సీట్లలో ఎన్డీపీపీ-బీజేపీ కూటమి 37 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంటే… సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ ను సాధించిందన్నమాట. అయితే… ఈ ఎన్డీపీపీ-బీజేపీ కూటమికి రాష్ట్రంలోని మిగిలిన అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించడంతో ప్రతిపక్షమే లేని ప్రభుత్వం అవతరించనుంది.

అవును… ఇప్పుడు నాగాలాండ్ అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండదు. అంతా ఒకే బ్యాచ్ సభ్యులు ఉంటారు! 60 మంది సభ్యులున్న నాగాలాండ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికల జరగగా.. మార్చి 2 న ఫలిల్తాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఎన్డీపీపీ-బీజేపీ కూటమి 37 స్థానాలు సాధించగా, ఎన్సీపీ – 7, ఎంపీపీ – 4, ఎంపీఎఫ్, లోక్ జనశక్తి పార్టీలు చెరో రెండు స్థానాలు గెలుచుకోగా.. ఇతరులు 8 స్థానాల్లో విజయం సాధించారు!

కాగా… నాగాలాండ్ లో ప్రతిపక్షం లేని ప్రభుత్వం ఏర్పడటం ఇదే తొలిసారి కాదు. గతంలో రెండు దఫాలు ఇదేవిధంగా జరిగింది. 2015, 2021లో జరిగిన ఎన్నికల్లో కూడా అన్ని పార్టీలు అధికార కూటమికి మద్దతు ప్రకటించాయి.