Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ జరగలేదు: తేల్చేసిన పోలీసులు

Pawan Kalyan

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ జరిగిందంటూ జనసేన పార్టీ హైద్రాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ హత్యకు 250 కోట్ల మేర సుపారీ కుదిరిందనీ, ఈ క్రమంలోనే ఆయన్ని హత్య చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారనీ, ఈ రెక్కీ కూడా ఆ క్రమంలో జరిగిందేననీ జనసేన ఆరోపిస్తోంది.

అయితే, రెక్కీ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు, సంఘటనపై విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా ముగ్గురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పబ్బుకి వెళ్ళి, మద్యం సేవించిన తాము, మద్యం మత్తులో వాహనాన్ని అక్కడే ఆపామనీ, సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడ్డామనీ నిందితులు పోలీసుల విచారణలో తెలిపారట.

దాంతో, రెక్కీ జరగలేదనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు. నిందితులైన యువకులకు నోటీసులు ఇచ్చామని అంటున్నారు పోలీసులు. అయితే, నిందితులు చెప్పిన మాటల ఆధారంగా రెక్కీ జరగలేదని పోలీసులు ఎలా నిర్ధారిస్తారని జనసేన పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది.

గత కొద్ది రోజులుగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా అనుమానాస్పద రీతిలో కొందరు వ్యక్తులు ఆయన్ను అనుసరిస్తున్నారన్నది జనసేన పార్టీ ఆరోపణ. జనసేనానికి జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. వైసీపీ నుంచే జనసేనానికి ప్రాణ హాని అన్నది జనసేన ఆరోపణ. ఈ నేపథ్యంలో, అసలు రెక్కీనే జరగలేదని హైద్రాబాద్ పోలీసులు తేల్చేయడం జనసేనకు మింగుడు పడ్డంలేదు.