అనుకూల మీడియా అలర్ట్… మరోసారి మంగళగిరిలో వద్దు లోకేష్!

ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయ ఉంది. ఈలోపు పొత్తులతో టీడీపీ – జనసేనలు బిజీగా ఉన్నాయి. ఇక మరోవైపు పథకాల ప్రచారాలతో పరోక్షంగా ఎన్నికల ప్రచారం చేస్తూ, ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ జగన్ మరింత బిజీగా గడుపుతున్నారు. ఈ సమయంలో నారాలోకేష్ ను మంగళగిరి పేరు చెప్పి బయపెడుతుంది టీడీపీ అనుకూల మీడియా. ఇప్పటికే ఒకసారి షాకిచ్చిన మంగళగిరిలో… మరోసారి షాక్ తప్పదని కన్ ఫాం చేసేస్తుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే… నియోజకవర్గం మార్చుకుంటే బెటరన్నట్లుగా పరోక్షంగా సూచిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేకస్థానం ఉంది. అమరావతి ప్రాంతంలోని ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో నారాలోకేష్ ఇక్కడినుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో 5,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో… ప్రత్యర్థులకు అడ్డంగా దొరికిపోయారు లోకేష్. ఎమ్మెల్యేగా గెలవలేనోడు అని లోకేష్ ని… కొడుకుని గెలిపించుకోలేనోడు అంటూ చంద్రబాబునీ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమరించారు. అయితే… మరోసారి మంగళగిరిలో ఆ పరిస్థితి తప్పకపోవచ్చని చెబుతుంది టీడీపీ అనుకూల మీడియా.

తాజాగా టీడీపీ అనుకూల మీడియాలో ఒక కథనం అచ్చైంది. ఆ కథనం ప్రకారం… 50 వేల పేద కుటుంబాల‌కు రాజ‌ధాని ప్రాంతంలో నివాస స్థలం ఇస్తే, ఇక వారంతా వైసీపీకి బ‌ల‌మైన ఓటు బ్యాంక్‌ గా మారిపోతారని.. ఫలితంగా నారా లోకేశ్ ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల పేదలకు సెంటు పట్టాలు ఎందుకు ఇస్తున్నట్లు? అది కూడా, ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గ పరిధినే ఎందుకు ఎంచుకున్నట్లు? అని ప్రశ్నిస్తూనే… ప‌క్కా ప్లాన్‌ తో లోకేశ్‌ ను ఓడించేందుకు ఇదొక స్కెచ్ అని రాసుకొచ్చింది. దీంతో… ఆ కథనం ఏ ఉద్దేశ్యంతో అచ్చేశారన్నది సాధారణ ప్రజానికానికి ఏకోశానా అర్ధం కాని పరిస్థితి.

జగన్ ఓట్ల కోసమే పేదలకు భూములు పంచుతున్నారా? అని అనుకుంటే… అందులో తప్పేముందనే సమాధానం దాగి ఉంది! సరిగ్గా ఎన్నికలకు ముందు పసుపూ కుంకుమా పంచితే తప్పు కానీ… ఎప్పుడో చేయాల్సిన ఈ పని కోర్టు తీర్పుల వల్ల ఆలస్యం అయ్యి ఇప్పటి కార్యరూపం దాల్చుతుంది కాబట్టి… జనం జగన్ ని సంకించే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇక.. లోకేష్ ను ఓడించడానికే ఈ ప్రయత్నం అంటే…? అందులో తప్పేముందు.. లోకేష్ నే కాదు ఈసారి చంద్రబాబుని సైతం ఓడిస్తామని బహిరంగంగా చెబుతున్న పరిస్థితి. మరి ఈ కథనం ఎందుకు అచ్చేసినట్లు అని ఆలోచిస్తే… లోకేష్ ను అప్రమత్తం చేయడానికేమో అనే సమాధానం వస్తుండటం కొసమెరుపు!