వీగిపోయిన అవిశ్వాసం

పార్లమెంటులో అనుకున్నట్లే జరిగింది. అవిశ్వాసం వీగిపోయింది. బిజెపి పై టిడిపి పెట్టిన అవిశ్వాసంపై దాదాపు 12 గంటల పాటు చర్చ జరిగింది. రాత్రి 11గంటలకు జరిగిన ఓటింగ్ లో అవిశ్వాసానికి అనుకూలంగా 126 ఓట్లు పోలుకాగా, వ్యతిరేకంగా 325 ఓట్లు పోలయ్యాయి. అవిశ్వాసంలో మొత్తం 451 మంది సభ్యులు పాల్గొన్నారు. 12 గంటల పాటు జరిగిన అవిశ్వాస చర్చలో 33 మంది సభ్యులు ప్రసంగించారు. రెండు సార్లు సభ వాయిదా పడింది. ఆద్యంతం ఆవేశంగా, రక్తి కట్టించే విధంగా సభ సాగింది. ఓటింగ్ జరిగినప్పుడు టిఆర్ ఎస్, బిజెడి,శివసేన సభ్యులు సభలో లేరు. అన్నాడీఎంకే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసినట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ చెప్పారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్టుగా ప్రకటించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను సోమవారానికి వాయిదా వేశారు.