చంద్రబాబు స్థానంలో పవనన్న.! నారా లోకేష్ కొత్త జపం.!

నిన్న మొన్నటిదాకా చంద్రన్న.. చంద్రన్న.. అంటూ నినదించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. ‘పవనన్న..’ అంటూ నినదిస్తున్నారు. ‘జై జనసేన’ అంటున్నారు, ‘పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి..’ అంటున్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నారా లోకేష్, ‘యువగళం పాదయాత్ర’ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. యువగళం పాదయాత్ర నేపథ్యంలో నారా లోకేష్ వెంట కొందరు జనసేన నేతలూ కనిపిస్తున్నారు. జనసేన క్యాడర్ పెద్దగా కనిపించడంలేదుగానీ, జనసేన జెండాల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మోయాల్సి వస్తోంది.

ఇంతకు ముందు వరకూ జరిగిన యువగళం పాదయాత్ర వేరు, చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో వచ్చిన గ్యాప్ తర్వాత జరుగుతున్న యువగళం పాదయాత్ర వేరు.! ఖర్చు పెరిగిపోతోంది.! అనుమానాలు, భయాలూ పెరిగిపోయాయ్ నారా లోకేష్‌కి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సీరియస్ వార్నింగ్స్ ఇచ్చేస్తూనే లోలోపల కంగారు పడుతున్నారు నారా లోకేష్.

ఒక్కటి మాత్రం నిజం.! జనసేన పార్టీతోనే టీడీపీ ఉనికి.. అనే అభిప్రాయానికి టీడీపీ అధినాయకత్వం వచ్చేసింది ఆంధ్రప్రదేశ్‌లో. అయితే, ఇంకా ఈ విషయమై టీడీపీ క్యాడర్ ఖచ్చితమైన అవగాహనకు రాలేకపోతోంది. జనసేనకు అంత సీన్ ఎందుకు ఇవ్వాలంటూ టీడీపీ క్యాడర్, అధినాయకత్వాన్ని నిలదీస్తోంది సోషల్ మీడియా వేదికగా.

‘పవనన్న..’ అంటూ లోకేష్ నినదించడాన్ని టీడీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. ‘టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పడబోతోంది..’ అని నారా లోకేష్ చెప్పడం పట్ల కూడా టీడీపీ క్యాడర్ సోషల్ మీడియా వేదికగా. సెటైర్లు వేస్తుండడం గమనార్హం.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, టీడీపీ – జనసేన మధ్య సీట్ల షేరింగ్ చెరి సగం వుండొచ్చని తెలుస్తోంది. అయితే, ఈ విషయమై జనసేనాని కొంచెం తటపటాయిస్తున్నారట. ఖచ్చితంగా గెలిచే సీట్లలో మాత్రమే, జనసేన అభ్యర్థుల్ని నిలబెట్టాలనే ఆలోచనతో జనసేనాని వున్నట్లు తెలుస్తోంది. అంటే ఎన్ని సీట్లు.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.