ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల హోరు మొదలైంది. అయితే సుప్రీం కోర్టు అనుమతించింది కాబట్టి ఎన్నికలకు ప్రభుత్వం కూడా సిద్దం అయింది కానీ నిమ్మగడ్డను మరోవైపు చుక్కలు చూపిస్తుంది. ఇప్పటికే ఎన్నికల కమిషనర్ ఏమి చెబితే అది చేయలేమని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. తాజాగా ఏపీ సిఎస్ ఆదిత్యా నాద్ దాస్ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు లేఖ రాశారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పంచాయతీ రాజ్ శాఖ అధికారుల మీద తీసుకోమన్న చర్యలకు సంబంధించి ఆయన లేఖ రాసినట్టు తెలుస్తోంది.
పంచాయతీ రాజ్ శాఖకు చెందిన అధికారులు ద్వివేది, గిరిజా శంకర్ ల మీద ఎస్ఈసి నిమ్మగడ్డ రాసిన అభిశంసన ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోవద్దని తాను రాసిన లేఖలో సిఎస్ దాస్ కోరారు. నిజానికి ఇద్దరు అధికారులపై ఎస్ఈసి నిబంధనలకు విరుద్ధంగా సెన్సుర్ ఆర్డర్ ఇచ్చింది. అది సరికాదని సిఎస్ లేఖలో పేర్కొన్నారు. ఈ ఇద్దరు అధికారుల సెన్సుర్ ఆర్డర్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సి ఎస్ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు రాసిన లేఖలో కోరారు. ఎస్ ఈ సి ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిన విషయాన్నికూడా సి ఎస్ లేఖలో పేర్కొన్నారు.
అంతే కాక ఎస్ ఈ సి కి కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల విషయంలో జోక్యం చేసుకోవద్దని కొంచెం సూచించాలని కోరారు. అసలు నిజానికి ఎన్నికల కోసం వోటర్ లిస్టు తయారు చేయనందువల్ల రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ 9 పేజీలతో కూడిన అభిశంసన ప్రక్రియను ప్రభుత్వానికి పంపారు. అయితే, ప్రభుత్వం దీనిని పరిశీలించి మళ్ళీ ఉత్తర్వులను తిరిగి ఎస్ఈసి పంపించింది. ఎస్ఈసి చర్యలు నిబంధనలకు విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా, ఏకపక్ష ధోరణిలో ఉన్నాయని పేర్కొంది.