2024 ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్ళాలని జనసేన పార్టీ గట్టిగా భీష్మించుక్కూర్చున్నట్లే కనిపిస్తోంది.! ఒంటరిగా వెళ్ళి వీరమరణం పొందడం వల్ల ఉపయోగం లేదనీ, కార్యకర్తలు, నాయకులు నష్టపోతారనీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. పొత్తు నైతికమా.? అనైతికమా.? అన్న విషయం పక్కన పెడితే, పదేళ్ళుగా పార్టీ కోసం శ్రమిస్తున్న జనసేన నేతలు, జనసైనికులకు ఇది కాస్త ఊరట కలిగించే నిర్ణయమే.
అయితే, మిత్రపక్షం బీజేపీ మాత్రం, తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దంటూ జనసేనకు సూచిస్తోందిట. తాజాగా, బీజేపీ జాతీయ నాయకత్వం పంపిన ఓ దూతతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైద్రాబాద్‌లో భేటీ అయ్యారని తెలుస్తోంది. దీన్ని రహస్య సమావేశంగా చెప్పుకోవచ్చేమో.
‘టీడీపీతో కలిసి వెళ్ళడం వల్ల ప్రయోజనం వుండదు’ అని ఢిల్లీ బీజేపీ దూత చెబితే, ‘వేరే ఆప్షన్ ఏమైనా వుందా.?’ అని జనసేనాని, బీజేపీ దూతని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దానికి, బీజేపీ దూత మొహం తేలేశారంటున్నారు. ఇది నిజమేనా.? టీడీపీతో కలిసేందుకు బీజేపీ కూడా తెరవెనుక సానుకూలంగా కనిపిస్తున్నప్పుడు మళ్ళీ ఈ కొత్త పంచాయితీ ఏంటి.?
2024 ఎన్నికలకు సంబంధించి బీజేపీ కూడా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. 2014, 2019 ఎన్నికలు వేరు, 2024 ఎన్నికలు వేరు. జాతీయ స్థాయిలో బీజేపీ కొంత వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. ఆ లెక్కన, ఏపీ సహా వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం అవ్వొచ్చు. అందుకే, వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది.