టీడీపీ, జనసేన మధ్య పొత్తు లేనట్టేనా.?

2019 ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోవడానికి చంద్రబాబు పాలన ఓ కారణమైతే, ఇంకో కారణం టీడీపీ అనుకూల మీడియా.. అందునా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. వేమూరి రాధాకృష్ణ పైత్యం టీడీపీకి శాపంగా మారిందన్నది బహిరంగ రహస్యం. 2024 ఎన్నికల్లో జనసేన – టీడీపీ పొత్తు గనుక కుదరకపోతే, దానికి కూడా ఏబీఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణే బాధ్యుడవుతాడేమో. నిజానికి, ఏబీఎన్ రాధాకృష్ణ తెలిసో తెలియకో జనసేన పార్టీకి పెద్ద మేలు చేశాడన్నది నిర్వివాదాంశం.

‘బీఆర్ఎస్ అధినేత కేసీయార్ వెయ్యి కోట్లు ఆఫర్ చేస్తే, దాన్ని పవన్ కళ్యాణ్ తిరస్కరించారు’ అని ఏబీఎన్ రాధాకృష్ణ తన ‘కొత్త పలుకు’లో రాసుకున్నాడాయె. ఆ రకంగా పవన్ కళ్యాణ్ మీద గతంలో పడ్డ ‘ప్యాకేజీ’ ముద్రని రాధాకృష్ణ చెరిపేశాడనుకోవాలి. ఇంతకంటే అద్భతమైన అవకాశం ఇంకోటి రాదంటూ, టీడీపీతో బంధాన్ని అస్సలు కలుపుకోకూడదన్న నిర్ణయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీతో కలవడం వల్ల బురద పులుముకోవడం తప్ప, జనసేనకు ఒరిగేదేమీ వుండదని పవన్ కళ్యాణ్‌కీ తెలుసు.

కాకపోతే, రాజకీయ వ్యూహాల్లో భాగంగా టీడీపీతో కలిస్తే, 2024 ఎన్నికల్లో రాజకీయంగా అడ్వాంటేజ్ అవుతుందని పవన్ కళ్యాణ్ అంతకు ముందు భావించి వుండొచ్చు. ఇప్పుడైతే మబ్బులు విడిపోయాయ్. టీడీపీ – జనసేన మధ్య సోషల్ మీడియా వేదికగా రచ్చ జరుగుతోంది. క్యాడర్ అయితే అస్సలు కలిసే అవకాశం కన్పించడంలేదు.

ఇది అధికార వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందా.? లేదంటే, వైసీపీ వ్యతిరేక ఓటు మొత్తం జనసేన వైపు టర్న్ అవుతుందా.? వేచి చూడాల్సిందే.