ఈ నిజామాబాద్ అమ్మాయి గురుకుల డి.ఎల్. టాపర్

తెలంగాణ గురుకుల డిగ్రీ లెక్చరర్ పోస్టుల ఫలితాలు వెలువడ్డాయి. హిస్టరీ విభాగంలో నిజామాబాద్ కు చెందిన వరలక్ష్మి అనే అమ్మాయి స్టేట్ టాప్ ర్యాంక్ సాధించారు. వరలక్ష్మి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు పట్టణం, హుస్నాబాద్ కాలనీకి చెందిన యువతి. ప్రస్తుతం వరలక్ష్మి ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ‘‘హిస్టరీ ఆఫ్ ఇరిగేషన్ సిస్టం ఇన్ తెలంగాణ రీజియన్ స్పెషల్ రిఫరెన్స్ ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్’’ అనే అంశంపై పిహెచ్ డి చేస్తున్నారు. 

ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశల్లో టిఎస్పిఎస్సీ జరిపిన పరీక్షలో వరలక్ష్మి టాప్ ర్యాంకు సాధించారు. టిఎస్పిఎస్సీ శనివారం నాడు ఈ ఫలితాలను వెలువరించింది.

నిరుపేద కుటుంబానికి చెందిన వరలక్ష్మి తండ్రి రమేష్ కారు డ్రైవర్ గా  పనిచేస్తున్నారు. తల్లి సరోజ బీడీలు చుడతూ జీవిస్తున్నారు. రెక్కాడితే డొక్కాడని కుటుంబంలో పుట్టినా వరలక్ష్మి ఇంట్లో ఒప్పించి ఉన్నత చదువులు చదివారు. కష్టపడి చదివి ప్రయోజకురాలయ్యారు. పట్టుదలతో చదివి గురుకుల డిగ్రీ లెక్చరర్ పరీక్షలో టాప్ ర్యాంకు సాధించిన వరలక్ష్మిని ఆర్మూర్ పట్టణంలోని తన స్నేహితులు, బంధు మిత్రులు అభినందిస్తున్నారు. 

వరలక్ష్మి తల్లిదండ్రులు రమేష్, సరోజ

వరలక్ష్మి గతంలోనూ పోటీ పరీక్షలు రాశారు. అయితే ఇంటర్వ్యూ దశలో అనేక ఉద్యోగాలు రాలేని పరిస్థితి ఉంది. జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఆర్కియాలజీ విభాగంలో ఇంటర్వ్యూ లో వెనకబడ్డారు. అయినా ఏమాత్రం నిరాశ చెందక వరలక్ష్మి పట్టుపట్టి గురుకుల పరీక్షకు ప్రిపేర్ అయ్యారు. ఉద్యోగం రావొచ్చు అన్న ఆశతో ఉన్న ఆమె స్టేట్ టాపర్ గా నిలవడంతో ఆనందంతో పొంగిపోయారు.