నిజామాబాద్ ఎన్నికల మీద రైతులకు 9 అనుమానాలు…

తెలంగాణ ప్రభుత్వం మీద ఆగ్రహంతో 185 అభ్యర్థులు నామినేషన్లు వేసిన నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.

ఇక్కడ ఎన్నికలు చదువురాని రైతు అభ్యర్థులకు అనుకూలంగా జరిగేలా కనిపించడం లేదని చెబుతూ ఈ నియోజకవర్గంలో పోలింగ్ ను పదిహేనురోజులు పాటు వాయిదావేయాలని అభ్యర్థిరైతులు అభ్యర్థిస్తున్నారు.

ఈ రోజు వారు జాయింట్ సిఇఒ ఆమ్రపాలిని కలసి అభ్యర్థన పత్రం అందించి తమ అభ్యంతరాలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. తమకు ఎన్నికల అధికారులు నుంచి ఎలాంటి సమాచారం అందలేదని వారు ఫిర్యాదుచేస్తున్నారు. కనీసం గుర్తు కేటాయించలేదుని, తామెలా క్యాంపెయిన్ చేయాలని వారు అడుగుతున్నారు.

ఎర్రజొన్న, పసుపు రైతులు తమ సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం అయిందని 178 బాధిత రైతులు నామినేషన్లు వేసి తమ సమస్యను జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. ఇది ఎన్నికల కమిషన్ కు సంకటంగా మారింది.

నిజామాబాద్ నియోజకవర్గం తెలంగాణ లో ఒక ప్రముఖ నియోజకవర్గం. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి కూతురు, టిఆర్ ఎస్ సిటింగ్ ఎంపి కల్వకుంట్ల కవిత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి నిరసనగానే వారు నామినేషన్ వేశారు. దీనితో మొత్తం అభ్యర్థుల సంఖ్య 185 కు చేరింది.
ఇందులో పార్టీల అభ్యర్దులు 7 గురు మాత్రమే. ఇతర ప్రధాన పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ నుంచి మధు యాష్కీ, బిజెపి నుంచి బండి సంజయ్ బరిలో ఉన్నారు.

ఎన్నికలను బ్యాలెట్ పేపర్ తో కాకుండా ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లతోజరపాలనుకుంటున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో తమ అభ్యంతరం తెలిపేందుకు వారు జాయింట్ సిఇవొను కలిశారు.
ఎన్నికలను వాయిదా వేయాలని, బ్యాలెట్ పేపర్ మీదుగానే ఎన్నికలు నిర్వహించాలని రైతు ఎంపీ అభ్యర్ధులు డిమాండ్ చేశారు. రైతుల తరఫున ఒక రైతు అభ్యర్థి మాట్లాడారు. వివరాలు:

1. ఎన్నికల నియమావళిని రిటర్నింగ్ అధికారి ఉల్లంఘిస్తున్నారు.

2. పోటిలో ఉన్నవారిలో చాలా మందికి వ్యవసాయం చేసే వారు. వారికి ఎలక్షన్ల మీద అవగాహన లేదు.

3.185 మంది అభ్యర్ధులు బరిలో ఉంటే 178 మంది రైతులే. అందులో చాలా మందికి చదువు రాదు. ఎన్నికల్లో ఎలా నడుచుకోవాలో తెలియదు. వాటిని రిటర్నింగ్ అధికారి పోటి చేస్తున్న అభ్యర్దులకు తెలియజేయాలి. కానీ ఇప్పటి వరకు చేయలేదు.

4.బ్యాలెట్ పేపర్లా లేక ఈవీఎంల అనే దాని పై కూడా స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదు. ఈవీఎంలే అని పేపర్లో చదివాం. ఇవిఎంల మీద నమ్మకం లేదు.

5. గుర్తులు కూడా కేటాయించామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు మాకు సింబల్స్ అందివ్వలేదు.

6.ఈవీఎంలపై మాకు అనుమానాలున్నాయి. బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి. అలా అయితేనే మాకు న్యాయం జరుగుతది.

6.ఎన్నికలను 15 రోజుల పాటు వాయిదా వేయాలి.

7. బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి. పోటిలో ఉన్న అభ్యర్దులకు ఇంత వరకు రిటర్నింగ్ అధికారి నుంచి ఎటువంటి సమాచారం రాలేదు.

8. పోటిలో ఉన్న వారందరికి నియమ నిబంధనలు చెప్పాలి. కానీ చెప్పలేదు. నిజామాబాద్ రిటర్నింగ్ అధికారి పై ఫిర్యాదు చేస్తాం.

9. ఎన్నికలను వాయిదా వేయాలి.అవసరమైతే ఎన్నికల వాయిదా కోసం హైకోర్టుకు వెళుతాం.

 
  దీని పై ఎన్నికల అధికారులు వెంటనే స్పందించాలని పోటిలో ఉన్న రైతు ఎంపీ అభ్యర్ధి తెలిపారు.