కల్వకుంట్ల కుటుంబంలో కల్లోలం.. కేటీఆర్ కి రాఖీ కట్టని కవిత.. అసలు ఏం జరుగుతోంది..!

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావు .. వీరి రాజకీయ అడుగులు, వ్యక్తిగత సంఘటనలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటాయి. ఇక రాఖీ పండుగ అయితే ఈ కుటుంబంలో ప్రత్యేకమైన సందర్భం. కవిత ప్రతి సంవత్సరం తన అన్న కేటీఆర్‌కు రాఖీ కట్టి ఆప్యాయతను పంచుతుంటుంది. అయితే ఈసారి ఆ సన్నివేశం కనిపించలేదు.

బీఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం, కేటీఆర్ ఈ రాఖీ పండుగ సమయంలో ఢిల్లీలో ఉన్నారు. జాతీయ నేతలు, పరిశ్రమల ప్రతినిధులతో సమావేశాలు, పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చలు, అలాగే బీసీ రిజర్వేషన్ల అంశంపై జాతీయ స్థాయి కార్యాచరణ కోసం ఆయన ఈ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. కానీ ఇది రాఖీ పండుగ రోజే కావడం చర్చకు దారితీసింది.

గత ఏడాది కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉండటంతో రాఖీ వేడుకకు దూరమయ్యారు. ఈసారి తప్పక రాఖీ కడతానని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఆమెకు, కేటీఆర్ అందుబాటులో లేకపోవడం నిరాశ కలిగించింది. రాజకీయాలు వేరే, బంధాలు వేరే అని చెప్పిన కవితకు ఈసారి కూడా రాఖీ కట్టే అవకాశం లేకపోవడం, ప్రత్యర్థులకు విమర్శకు అవకాశం కల్పించారు.

ఇక తండ్రి కేసీఆర్ మాత్రం గజ్వేల్‌లోని తన నివాసంలో సాదాసీదాగా రాఖీ వేడుక జరుపుకున్నారు. చెల్లెళ్ల ఆశీర్వాదాలు అందుకుని, వారికి బహుమతులు ఇచ్చి, కుటుంబ బంధాలు రాజకీయాల కంటే పైగా ఉంటాయని పరోక్ష సందేశం ఇచ్చారు. ఈ సంకేతం కేటీఆర్, కవితకు ఎంతవరకు చేరిందో తెలియదు.

రాఖీ పండుగ కుటుంబాలను కలుపుకునే వేళ. కానీ ఈసారి కల్వకుంట్ల ఇంట్లో ఆ ఆప్యాయత క్షణాలు మిస్సవ్వడంతో, రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలు, ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకరినొకరు చేరువ చేసుకునే మంచి అవకాశాన్ని కోల్పోవడంతో, ఈ కుటుంబ బంధాలపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.