మధ్య తరగతే టార్గెట్ గా బడ్జెట్ వరాలు

తాజా బడ్జెట్ లో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ మధ్య తరగతి జనాలను ఉద్దేశించి చాలా వరాలే కురిపించారు. చైనా, అమెరికా తర్వాత భారతదేశానిదే అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా మంత్రి చెప్పారు. చిన్న మధ్య తరహా సంస్ధల్లో ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మంత్రి చెప్పొకొచ్చారు. చిన్న, మధ్య తరహా సంస్ధలంటేనే మధ్య తరగతి జనాలను దృష్టిలో పెట్టుకున్నట్లు అర్ధమైపోతోంది.

మొన్నటి ఎన్నికల్లో మంచి మెజారిటితో రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడి ప్రభుత్వం తాజా బడ్జెట్లో వివిధ రంగాలను దృష్టిలో ఉంచుకునే బడ్జెట్ తయారు చేసినట్లు తెలిసిపోతోంది.  పారిశ్రామిక వాడల ఏర్పాటుతోనే మౌళిక సదుపాయాల కల్పన సాధ్యమైందన్నారు.

ముద్ర పథకం సామాన్యుల జీవన విధానాన్నే మార్చేసిందన్నారు. అంతేకానీ ఎలా మార్చేసింది మాత్రం చెప్పలేదు. సంపదను సృష్టించటలో మేకిన్ ఇండియా పథకం బాగా దోహపడిందట. తన బడ్టెట్ ప్రసంగంలో కేంద్రప్రభుత్వ ప్రాధాన్యతలను మంత్రి వివరించారు. ఆమె చెప్పిన ప్రకారం వాణిజ్య అభివృద్ధికి నూతన విధానాలు అమలు చేస్తామన్నారు.

చిన్న నగరాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయాలంటే దిగువ, మధ్య తరగతి జనాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో మంత్రే చెప్పాలి. సరే మొత్తానికి నిర్మల ప్రసంగం ఎలాగుందంటే మోడి ప్రధానమంత్రి అయిన తర్వాతే  దేశ ఆర్ధిక ప్రగతి అభివృద్ధి పధంలో పరుగులు పెడుతోందన్నట్లుగా ఉంది.