ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వం మీద తన మాటను నెగ్గించుకోవడానికి ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడంలేదు. కేసులు పదుల సంఖ్యలో ఉండగా ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికలను వాయిదావేశారు ఆయన. చంద్రబాబు ఆదేశాల మేరకే ఆయనలా చేశారని ప్రభుత్వం వాదిస్తోంది. ఆ సంగతి పక్కనబెడితే కరోనా కేసులు రోజుకు 3000లకు తగ్గకుండా వస్తున్న ఈ సమయంలో ఎన్నికల ప్రక్రియను రీస్టార్ట్ చేస్తానని అంటున్నారు నిమ్మగడ్డ. క్రితంసారి ఎన్నికలు వాయిదాపడ్డప్పుడు నిమ్మగడ్డ పని పట్టాలనుకున్న ప్రభుత్వానికి అది సాధ్యంకాలేదు. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటలు సాగనివ్వకూడదని అనుకుంటోంది.
అయితే నిమ్మగడ్డ మహా తెలివిగా వ్యవహరిస్తున్నారు. స్కూళ్ళు తెరిచిన ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టడానికి ఎందుకు అభ్యంతరం అంటూ లాజిక్ లాగిన అయన మరొక అడుగు ముందుకువేశారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. దీన్ని గొప్ప అవకాశంగా భావించిన నిమ్మగడ్డ అఫిడవిట్లో కరోనా సెకండ్ వేవ్ గురించి నిపుణులు హెచ్చరిస్తున్న కారణంగా ఎన్నికలను వాయిదావేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిపి ఇప్పటికే స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీ కాలం ముగిసి చాలా కాలమైందని, గతంలో కరోనా ఉధృతి కారణంగా ఎన్నికలను వాయిదా వేశామని ఇప్పుడు పరిస్థితుల్లో అదుపులోనే ఉన్నాయి కాబట్టి ఎన్నికల ప్రక్రియను తిరిగి మొదలుపెట్టాలని భావిస్తున్నట్టు తన వెర్షన్ తెలిపారు.
అలాగే ఎన్నికల కమీషన్ పట్ల ప్రభుత్వం వ్యవహిరిస్తున్న తీరును ప్త్రస్థావిస్తూ గతంలో చోటు చేసుకున్న అన్ని సంగతులను ఉటంకిస్తూ అఫిడవిట్ సమర్పించారు. అలాగే హైకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా అందుకు అనుగుణంగా నడుచుకుంటామని తెలియజేశారు. ఈసీ వినయపూర్వకంగా రాసిన ఈ అఫిడవిట్ చాలా ప్రభావాన్నే చూపే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలే నిర్వహిస్తున్నారు. పైగా రాష్ట్రంలో కరోనాను విజయవంతంగా కట్టడి చేశామని ప్రభుత్వం అంటోంది. ఈ రెండు విషయాలను కూడ కోర్టు పరిణగణలోకి తీసుకుంటే నిమ్మగడ్డ గెలుపు ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.