ఆయన మాట్లాడినా.. తిట్టినా.. పొగిడినా.. అది ఆయనకే చెల్లుబాటవుతుంది. ఆయన స్వభావం తెలియని వారు నోటి దురుసెక్కెవ అనుకుంటారు. మొండిఘటుడు, ధైర్యవంతుడు, ఎవరి మాట విననివాడు ఆయన. ఆయన ఏం చేసినా సంచలనమే… నలుగురిలో చర్చనే.. ఇప్పుడు ఆయన టిడిపిలో ఉంటూనే టిడిపికి పెద్ద షాక్ నిచ్చారు. అతనే రాయలసీమ డైనమిక్ లీడర్, అనంతపురం ఎంపీ జె.సి దివాకర్ రెడ్డి.
కేంద్ర ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అది శుక్రవారం చర్చకు రానుంది. దీంతో అన్ని పార్టీల మద్దతు కోరుతున్న వేళ సొంత పార్టీ నేత నుంచే టిడిపికి గట్టి దెబ్బ తగిలింది. అవిశ్వాసంపై జరిగే చర్చకు నేను హాజరుకానంటూ జెసి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.,
“నేను అవిశ్వాసానికి రాను పో.. ఏమైతది నేను పోకపోతే ఏమి కాదు. అయినా నాకు ఇంగ్లీషు రాదు, హిందీ రాదు. నేను పోయి ఏంజేయాలే గాడ, నేను వెళ్లినా వెళ్లకున్నా సభలో నష్టమేమి జరుగదు. సభలో మాట్లాడేవాళ్లు చాలా మందే ఉన్నారు. వాళ్లే చూసుకుంటారు. బిజెపినే గెలుస్తదని తెలిసినంక ఇంకా ఏంజేయాలే పోయి, అందుకే నేను అనంతపురంలనే ఉన్నా” అని జెసి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అన్ని పార్టీలు అవిశ్వాసానికి సంబంధించి ఇప్పటికే విప్ జారీ చేశాయి. జెసి దివాకర్ రెడ్డి విప్ ను కూడా లెక్క చేయకుండా అనంతపురంలోనే ఉండిపోయాడు. నేను ఎట్టి పరిస్థితిలోను ఢిల్లీకి వెళ్లేది లేదని తెలిపారు. అయితే జెసి అలకకు అంతర్గత కారణం ఉన్నట్టు తెలుస్తోంది. అవిశ్వాసానికి మద్దతు కోరేందుకు వివిధ పార్టీల నేతలను కలిసే బాధ్యతను ఎంపీ సుజనా చౌదరికి అప్పగించారు చంద్రబాబు. దీనిలో జెసి దివాకర్ రెడ్డి కూడా సభ్యుడిగా ఉన్నారు. సుజనా చౌదరి వివిధ పార్టీలను కలిసేటప్పుడు జెసి దివాకర్ రెడ్డిని కలుపుకు పోలేదనే ఆరోపణలు వస్తున్నాయి.అందుకే జెసి దివాకర్ రెడ్డి అలకపాన్పు ఎక్కినట్టు టిడిపి నేతలు అంటున్నారు.
జెసి దివాకర్ రెడ్డి వ్యవహారంతో సీఎం చంద్రబాబే రంగంలోకి దిగుతున్నారట. ఎలాగైనా జెసిని ఢిల్లికి పంపించి అవిశ్వాస తీర్మానంలో పాల్గొనేలా చూస్తున్నారట. చూశారుగా ఒక్క నిర్ణయంతో అందరిలో హాట్ టాపిక్ అయ్యారు జెసి దివాకర్ రెడ్డి. మరీ ఆయన ఢిల్లికి వెళ్తారో లేదో చూడాలి.