కొత్త భయం… కండువాలు మార్చే కార్యక్రమం వాయిదా!

ఎన్నికల సీజన్ దగ్గరపడిందంటే… పార్టీలు మారేవారితో సరికొత్త సందడి నెలకొంటుంటుంది. టిక్కెట్ దక్కలేదనో, ఆశించినచోట ఇవ్వలేదనో.. కారణం ఏదైనా కార్యకర్తల సూచనల మేరకే అని చెబుతూ పలువురు నేతలు కండువాలు మార్చేస్తుంటారు. నిన్నటివరకూ చెప్పిన మాటలను గాల్లో కలిపేస్తుంటారు. నిన్నటివరకూ ఉన్న పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటారు. తాను కొత్తగా చేరబోయే పార్తీ అధినేతను అందలం ఎక్కించేస్తుంటారు!

పైగా… సామాజిక సమీకరణలు, సర్వేల ఫలితాలు, నేతల పనితీరు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ జగన్ పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ ల మార్పు చేర్పుల కార్యక్రమానికి తెరలేపిన నేపథ్యంలో… ఈసారి “గోపి”ల సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చని అంటున్నారు. పైగా వైసీపీ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై ఒక క్లారిటీకి వస్తున్న నేపథ్యంలో… వీలైనంత తొందర్లో టీడీపీ – జనసేన ఫస్ట్ లిస్ట్ రెడీ అవ్వకముందే ఈ కార్యక్రమం పూర్తిచేయాలని జంపింగ్ లు భావిస్తున్నారు.

అయితే… తాజా పరిణామాలతో వేరే పార్టీలో చేరడానికి వైసీపీ ఎమ్మెల్యేలు వెనుకంజ వేస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ, జనసేనలో చేరాలనుకుంటున్న ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారని అంటున్నారు. అందుకు కారణం… అనర్హత వేటు పడుతుందని భయపడటమే అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఇప్పటికే గంటా శ్రీనివాస రావు రాజీనామాను ఆమోదించడంతో మిగిలినవారు కాస్త వెనకడుగు వేస్తున్నారని సమాచారం.

దీంతో… వైసీపీ నుంచి ఇతర పార్టీలలోకి వెళ్లాలనుకుంటున్న అధికారపార్టీ ఎమ్మెల్యేలు… రాజ్యసభ ఎన్నికలు ముగిసిన తర్వాతనే ఆ పనికి పూనుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అప్పటివరకూ స్థబ్ధగా ఉండటమే బెటరనే ఆలోచనకు వారొచ్చారని అంటున్నారు. ఎప్పుడైతే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించడం.. త్వరలో మరికొందరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి సిద్ధమవుతున్నారన్న ప్రచారంతో వెనకడుగు వేస్తున్నారని తెలుస్తుంది.

ఉదాహరణకు పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారధి టీడీపీలో జాయిన్ అవ్వడానికి ముహూర్తం ఫిక్స్ చేశారని అంటున్నారు. వాస్తవానికి ఆయన ఇప్పటికే టీడీపీలో చేరాల్సి ఉంది. ఇందులో భాగంగా ఈ నెల 21, 23 తేదీల్లో ఆయన సైకిల్ ఎక్కుతారని కథనాలొచ్చాయి. అయితే… టీడీపీలో చేరితే రాజ్యసభ ఎన్నికలలో ఓటు వేయడానికి అవకాశం లేకుండా అనర్హత వేటు పడుతుందని వాయిదా వేసుకున్నారని అంటున్నారు.

ఈయనతో పాటు మరికొంతమంది వైసీపీలో టిక్కెట్ దొరకని ఎమ్మెల్యేలు సైతం టీడీపీలో చేరే ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేశారని తెలుస్తుంది. ఇదే సమయంలో… టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాజ్యసభ ఎన్నికలు పూర్తయ్యే వరకూ వేచి ఉండాలని సూచిస్తున్నట్లు సమాచారం.