తెరపైకి వైఎస్ వివేకా రెండో భార్య షమీమ్.!

మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త అంశం తెరపైకొచ్చింది. నిజానికి ఇది మరీ అంత కొత్త విషయమేమీ కాదు. కాకపోతే, ఇప్పటిదాకా అది కేవలం ప్రచారం మాత్రమే. అదిప్పుడు నిజమనడానికి ఆధారాలు తెరపైకొస్తున్నాయి.

వైఎస్ వివేకానంద రెడ్డికి రెండో వివాహమైందనీ, ఆ రెండో భార్య పేరు షమీమ్ అనీ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ రెండో భార్య షమీమ్, ఏకంగా సీబీఐకే స్టేట్మెంట్ ఇచ్చారట. 2010లోనే వైఎస్ వివేకానంద రెడ్డితో షమీమ్‌కి పెళ్ళి జరిగిందట. 2015లో ఈ దంపతులకు ఓ కొడుకు పుట్టాడట.

వివేకాతో వివాహం తర్వాత షమీమ్‌కి, వివేకా కుమార్తె సునీత నుంచి బెదిరింపులు వచ్చాయట. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా బెదిరింపులకు దిగారట.

వివేకా ఆస్తిపై కూతురు, అల్లుడు కన్నేశారట. రెండో భార్యగా తనకు వాటా దక్కుతుందన్న కారణంతోనే, వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేశారట. అయినా, చట్ట ప్రకారం అయితే వైఎస్ వివేకానంద రెడ్డి ఆస్తి ఆయన కుమార్తెకే చెల్లుతుంది. ఎందుకంటే, రెండో వివాహం చట్ట బద్ధంగా జరగలేదు గనుక. చట్టబద్ధంగా జరిగి వుంటే, ఎన్నికల అఫిడవిట్‌లోనే వాటిని వైఎస్ వివేకా పేర్కొనేవారు.

సో, ఇక్కడ షమీమ్ వాదనలో అర్థమే లేదన్నది న్యాయ నిపుణుల వాదన. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఈ కేసు నుంచి బయటకు లాగేందుకు షమీమ్‌ని తెరపైకి తెచ్చారా.? అన్న కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.